YCP MLA Kotamreddy Comments: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు..!
Kotamreddy Sridhar Reddy News: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను కాదంటూ మాట్లాడారు.
MLA Kotamreddy Sridhar Reddy Sensational Comments: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... అధికార వైసీపీ ఎమ్మెల్యే. నెల్లూరు రూరల్ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు అన్నట్లు ఆయన వ్యవహరశైలి కూడా ఉంటుంది. ఆయన చెప్పాలనుకునే విషయాన్ని కూడా డైరెక్ట్ గా అనేస్తారు. అధికార పార్టీలో సీనియర్ నేతగా పేరున్న శ్రీధర్ రెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని.. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని కామెంట్స్ చేశారు. ఈ విషయం తనకు ముందు నుండే తెలుసని.. రహస్యాలు మాట్లాడుకొనేందుకు తనకు వేరే ఫోన్ ఉందన్నారు. తన వద్ద 12 సిమ్ కార్డులున్నాయన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
శనివారం నెల్లూరులో జరిగిన ఓ సమావేశం అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఆ సమావేశం జరిగే ప్రాంతానికి కొందరు ఇంటిలిజెన్స్ అధికారులు రావటంతో… కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలోనే సదరు అధికారులను ఉద్దేశించి… తానేమైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా అంటూ ప్రశ్నించారని… తన కాల్స్ రికార్డు అవుతున్నాయనే విషయం తెలుసని కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. తన దగ్గర 12 సిమ్ కార్డులు ఉన్నాయని…తనకు ఏం చేయాలో బాగా తెలుసని వ్యాఖ్యానించినట్లు కూడా సమాచారం. అవసరమైతే తనపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా ఓ ఐపీఎస్ అధికారిని కూడా నియమించుకోండి అంటూ ఘాటుగా కోటంరెడ్డి కామెంట్స్ చేశారని తెలుస్తోంది.
ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కామెంట్స్ సొంత పార్టీలోనే కాదు.. జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై కోటంరెడ్డి నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి కోటంరెడ్డి తీరు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత నెలలో కూడా అధికారులపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారారు.. కానీ తన పనులు మాత్రం కావడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్ పనులు చేపట్టలేదని వ్యాఖ్యానించారు. ఫలితంగా 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందన్నారు.. దీనికి ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నించారు. బారాషాహిద్ దర్గాకు 10 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసినా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అనుమతి ఇవ్వలేదన్నారు. బీసీ భవన్ నిర్మాణ పనులు కూడా మిగిలిపోయాయి చెప్పుకొచ్చారు. నిధులు రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని... అసలు ఈ రావత్ ఎవరండీ అంటూ కామెంట్స్ చేశారు. పొట్టేపాలెం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న కోటంరెడ్డి. దీనిపై అధికారుల్ని అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
గతంలో రైల్వే, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలోకి దిగటం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కూడా అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంటూ కామెంట్స్ చేయటం కూడా హాట్ టాపిక్ మారింది.
సంబంధిత కథనం