Warangal Bjp Candidate: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్? మాజీ డీజీపీ వైపు బీజేపీ మొగ్గు…-krishnaprasad as bjp warangal mp candidate bjp leaning towards former dgp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Bjp Candidate: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్? మాజీ డీజీపీ వైపు బీజేపీ మొగ్గు…

Warangal Bjp Candidate: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్? మాజీ డీజీపీ వైపు బీజేపీ మొగ్గు…

HT Telugu Desk HT Telugu
Mar 12, 2024 07:51 AM IST

Warangal Bjp Candidate: లోక్‌సభ ఎన్నికల వేళ వరంగల్‌ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతోంది. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

వరంగల్ బీజేపీ ఎంపీ రేసులో మాజీ డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్
వరంగల్ బీజేపీ ఎంపీ రేసులో మాజీ డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్

Warangal Bjp Candidate: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఎలక్షన్ కోడ్ అమలులోకి రానుండగా.. అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

yearly horoscope entry point

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మరోసారి అధికారం దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బలమైన నేతను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.

నిన్నమొన్నటి వరకు బీజేపీ వరంగల్ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత అరూరి రమేశ్ Aruri Ramesh కు ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆయన పార్టీ మారే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. దీంతో కొద్దిరోజులుగా చర్చలో ఉన్న మాజీ డీజీపీ Ex DGP తెన్నేటి కృష్ణ ప్రసాద్ Krishna Prasad కే టికెట్ ఫైనల్ చేశారనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ వరంగల్ టికెట్ ఆశావహుల్లో ఆయన పేరు మొదట్నుంచీ వినిపిస్తుండగా.. ఇప్పుడు టికెట్ ఆయనకే దక్కుతుందనే చర్చ నడుస్తోంది.

తప్పుకున్న అరూరి..

బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ Aruri Ramesh మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం అదే పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తూ వచ్చారు.

క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడం. పోటీ చేసినా ఫలితం దక్కే అవకాశాలు తక్కువగానే ఉండటంతో అరూరి బీజేపీ వైపు ఆలోచన చేశారు. ఈ మేరకు గత వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు కూడా రెడీ అయ్యారు.

ఇంతలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడి నుంచే తాను పార్టీ మారడం లేదంటూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఆయన బీజేపీ వరంగల్ టికెట్ పోటీ నుంచి సైడ్ అయిపోయినట్లయ్యింది.

వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన నేతలతో పాటు మరికొందరు కూడా ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున బరిలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ పేరు ప్రధానంగా వినిపించింది.

ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ వెనుకడుగు వేసినట్లు తెలిసింది. ఆ తరువాత గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గుండె విజయరామారావు పేరు కూడా తెరమీదకు వచ్చింది. పార్టీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి కూడా టికెట్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది.

కృష్ణ ప్రసాద్ వైపే మొగ్గు..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుండగా.. మిగతా రెండు స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తోంది. రెండు పార్టీలకు ధీటుగా బలమైన నేతను రంగంలో దించేందుకు బీజేపీ కూడా పార్టీ అగ్ర నేతలతో సమాలోచనలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే మాజీ డీజీపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మించిన ప్రత్యామ్నాయం పార్టీకి కూడా కనిపించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతోనే రెండు రోజుల్లో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కృష్ణ ప్రసాద్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

గ్రౌండ్ వర్క్స్ స్టార్ట్ చేసిన కేపీ

కృష్ణ ప్రసాద్ వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే డీఐజీగా కూడా సేవలందించి దండకారణ్యంలో దారి తప్పిన యువతను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో శ్రమించారు. అంతేగాకుండా కేపీ ఫౌండేషన్ ప్రారంభించి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో శిక్షణను అందించారు.

డిజిటల్ ఇండియా ఉద్యమంలో భాగంగా 20 వేల మందికిపైగా డిజిటల్ లిటరసీలో ట్రైనింగ్ ఇప్పించారు. ఉమ్మడి వరంగల్ తో పాటు మేడారం జాతరలో ఉచిత మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి, వైద్య సేవలందించేలా కృషి చేశారు. గ్రామీణ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు కూడా అందించారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు స్టార్ క్యాంపెయినర్ గా కూడా వ్యవహరిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారందరి సమన్వయంతో టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకట్రెండు రోజుల్లోనే బీజేపీ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించనుండగా.. వరంగల్ ఎంపీ టికెట్ ను కృష్ణ ప్రసాద్ కే కేటాయిస్తుందో.. వేరెవరికైనా పట్టం కడుతుందో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner