డిపాజిట్లు రాని బీజేపీకి అన్ని‌ సీట్లా? చంద్రబాబుపై సొంత పార్టీ నేతల అసంతృప్తి-tdp leaders discontent over allocating 16 seats to bjp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  డిపాజిట్లు రాని బీజేపీకి అన్ని‌ సీట్లా? చంద్రబాబుపై సొంత పార్టీ నేతల అసంతృప్తి

డిపాజిట్లు రాని బీజేపీకి అన్ని‌ సీట్లా? చంద్రబాబుపై సొంత పార్టీ నేతల అసంతృప్తి

HT Telugu Desk HT Telugu
Mar 27, 2024 01:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కానీ కూటమిలో స్థానాల కేటాయింపు, టికెట్ల పంపిణీపై అలకలు, అసంతృప్తులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రధాన మంత్రి మోదీతో సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ప్రధాన మంత్రి మోదీతో సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (BJP Andhra Pradesh - X)

మూడు పార్టీల పొత్తుల కూటమితో చంద్రబాబు, ఒంటరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో తలపడుతున్నారు. 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపి‌ స్థానాలకు కూటమిలోని టిడిపి 144 ఎమ్మెల్యే, 17 ఎంపి స్థానాలకు పోటీ చేస్తోంది. ఇక బిజెపి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తోంది. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపి స్థానాలకు పోటీ చేస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని బీజేపీకి పొత్తుల్లో 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు ఎలా ఇచ్చారంటే టీడీపీ శ్రేణులు, నాయకులు చంద్రబాబుపై లోలోన అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

బీజేపీకి 2014 ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలు

2014లో మోడీ అభివృద్ధి నినాదం బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజులవి. అప్పుడు టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా బిజెపికి తొమ్మిది ఎమ్మెల్యే, నాలుగు ఎంపి స్థానాలను చంద్రబాబు కేటాయించారు. విభజన అనంతరం ప్రజలు గుర్తించదగిన పెద్ద సాయం ఏదీ ఆంధ్ర ప్రదేశ్‌కు దక్కకపోవడంతో మోడీ పట్ల ఇప్పుడు‌ ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. రాష్ట్ర విభజన హామీలైన ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, దుగిరాజపట్నం పోర్టు వంటి ఇవ్వకపోవడంతో పాటు విశాఖ స్టీలు ఉనికికే ముప్పు వాటిల్లుతున్న సంకేతాలు ఉండడంతో ప్రజల్లో మోడీ పట్ల వ్యతిరేకత ఉంది. కానీ బీజేపీకి గతం కంటే ఎక్కువగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో‌ 6 ఎంపి, 10 ఎమ్మెల్యే స్థానాలు బిజెపికి కేటాయించి, టిడిపి కార్యకర్తలకు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేస్తున్నారు.

అప్పుడు బీజేపీ గెలిచినవెన్నీ?

9 ఎమ్మెల్యే, 4 ఎంపి స్థానాల్లో బీజేపీ కేవలం నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలే గెలిచింది. ఎమ్మెల్యేలుగా విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణు కుమార్ రాజు, రాజమండ్రి సిటీ నుంచి ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ గెలుపొందారు.

విజయవాడ వెస్టు నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, నరసరావుపేట నుంచి నల్లబోతు వెంకటరావు, నెల్లూరు రూరల్ నుంచి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, కోడుమూరు (ఎస్సి) మదరపు రేణుక, మదనపల్లె నుంచి చల్లపల్లే నరసింహారెడ్డి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎంపిలుగా విశాఖపట్నం నుంచి కంభంపాటి హరిబాబు, నర్సాపురం నుంచి గోకరాజు గంగరాజు గెలిచారు. రాజంపేట నుంచి పురందేశ్వరి, తిరుపతి నుంచి కారుమంచి జయరాం ఓటమి పాలయ్యారు.

2019లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ

2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బిజెపి 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపిలు పోటీచేయగా డిపాజిట్లు కూడా దక్కలేదు. కేవలం 0.84 శాతం ఓట్లు వచ్చాయి. అలాంటి బిజెపికి పొత్తులో 16 సీట్లు (ఎంపీ, ఎమ్మెల్యే కలిపి) కట్టబెట్టడంపై టిడిపి‌ సీనియర్ నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పొత్తుల వల్ల తమకు‌ సీట్లు రాకుండా పోయిందని మండిపడుతున్నారు. అసలు వారికి అన్ని సీట్లు‌ కట్టబెట్టటమేంటని ప్రశ్నిస్తున్నారు.

వలస నేతలకే బీజేపీ ప్రాధాన్యత

బిజెపిలో ఎంపి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో టిడిపి, వైసిపి, కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన వారికే ఇచ్చారు. నర్సాపురం తప్ప మిగిలిన అన్ని స్థానాలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే బిజెపి టిక్కెట్లు ఇచ్చింది. ఇందులో కొందరు కొంత కాలం క్రితమే పార్టీలో చేరి కీలక పదవులు దక్కించుకున్న వారూ ఉన్నారు. గతంలో టిడిపిలో ఉండి బిజెపిలో చేరిన సిఎం రమేష్‌కు అనకాపల్లి, వైసిపి నుంచి బిజెపిలో చేరిన కొత్తపల్లి గీతకు అరకు, కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన పురందేశ్వరికి రాజమండ్రి, వైసిపి నుంచి బిజెపిలో చేరిన వర ప్రసాద్‌కు తిరుపతి, కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట లోక్‌సభ టిక్కట్లు ఇచ్చింది. నర్సాపురం ఎంపి ఒక్కటే మొదటి నుంచి బిజెపిలో ఉన్న సతీష్ వర్మకి ఇచ్చింది.