RRR Operation Fail: రఘురామ ఆపరేషన్ సక్సెస్ అయినట్టా ఫెయిలైనట్టా… బీజేపీతో టీడీపీ జట్టు కట్టినా దక్కని టిక్కెట్
RRR Operation: టీడీపీని బీజేపికి దగ్గర చేయడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా వైసేపీకి కంట్లో నలుసులా వ్యవహరించిన రఘురామ చివరికి సాధించింది ఏమిటనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
RRR Operation: రఘు రామకృష్ణమ రాజు RRR ఆశలపై నీళ్లు చల్లుతూ బీజేపీ ఎంపీ BJP MP అభ్యర్థుల జాబితాలో సీటు గల్లంతైంది. రచ్చబండ పేరుతో నాలుగేళ్లుగా నానా రాద్ధాంతం చేసిన రఘురామ చివరకు టిక్కెట్ కూడా తెచ్చుకోలేకపోయారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీలో YCP చేరిన రఘురామ ఏడాదిలోనే వైసీపీకి దూరం అయ్యారు. అనర్హత వేటు పడకుండా ఐదేళ్ల పాటు లోక్‌సభలో మేనేజ్ చేయగలిగినా మరోసారి పోటీ చేసే అవకాశాన్ని మాత్రం దక్కించుకోలేక పోయారు.
వైసీపీ తరపున నర్సాపురం లోక్‌సభ Loksabha నియోజక వర్గం నుంచి పోటీ చేసిన రఘురామ కృష్ణం రాజు అతి తక్కువ సమయంలో వైసీపీ అధ్యక్షుడికి బద్దశత్రువుగా మారారు. బీజేపీ నేతలతో అంటకాగడం, వైసీపీలో తనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం కావాలని కోరుకోవడంతో వివాదాలు మొదలయ్యాయి.
తొలిసారి ఎంపీగా ఎన్నికైన రఘురామకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అవకాశం కల్పించామని వైసీపీ చెబుతుంటే, తనను కనీసం గౌరవం ఇచ్చే వారు కాదని ఆర్‌ఆర్‌ఆర్ ఆరోపించే వారు. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో అసలు విషయాలు మాత్రం నేటికి బయటకు రాలేదు.
పవర్ ప్లాంట్ల గొడవలేనా…
వైసీపీ వర్గాల మాత్రం రఘురామకు చెందిన ఈస్ట్‌కోస్ట్ పవర్ ప్లాంట్స్ Power Plants విషయంలో తలెత్తిన వివాదాలే అసలు కారణమని చెబుతారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పవర్ ప్లాంట్‌ను ఏపీ ప్రభుత్వానికి విక్రయించాలనే ప్రతిపాదనలకు సిఎం జగన్ అంగీకరించక పోవడంతోనే వివాదం తలెత్తినట్టు చెబుతున్నారు.
2014కు ముందు తమిళనాడులో ఉన్న ప్లాంటును ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించాలని చేసిన ప్రయత్నాలు కూడా మధ్యలో బెడిసి కొట్టాయి. జయలలిత ప్రభుత్వం అధికారంలో ఉండగా థర్మల్ పవర్ ప్లాంట్‌ను విక్రయించేందుకు సిద్ధమైనా తర్వాత రకరకాల కారణాలతో ఆ ప్రతిపాదనలు వికటించాయి. ఆ తర్వాత వైసీపీలో చేరిన రఘురామ నర్సాపురంలో గెలిచారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం ప్లాంటును ప్రభుత్వానికి విక్రయించాలని భావించారు. పవర్ ప్లాంట్స్ విషయంలో కేంద్రం నిర్ణయానికి వెళ్లడానికి ఏపీ సర్కారు విముఖత చూపడంతో జగన్, రఘురామ మధ్య దూరం పెరిగిందని వైసీపీ వర్గాలు చెబుతాయి.
ఆ తర్వాత కాలంలో బీజేపీ నేతలతో అంటకాగడం, వైసీపీ లోక్‌సభ పక్ష నాయకుల చెప్పు చేతల్లో ఉండటానికి నిరాకరించడం, తరచూ మీడియా భేటీలు నిర్వహించడం వంటి చర్యలతో దూరం మరింత పెరిగింది. 2020 కోవిడ్ నుంచి జగన్‌తో మరింత దూరం పెరిగింది. తనను తాను ప్రత్యేకమని భావించే రఘురామ వ్యవహారం జగన్‌కు అస్సలు గిట్టలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతాయి.
జగన్‌తో విభేదాలు పెరిగిన తర్వాత ఢిల్లీలో నిత్యం ప్రెస్ మీట్‌లు పెట్టేవాడు. సొంత పార్టీపై విమర్శలు గుప్పించడంపై నాలుగేళ్ల క్రితమే రఘురామ మీడియాకు అంతర్గత సంభాషణల్లో క్లారిటీ ఇచ్చేవాడు. టీడీపీని బీజేపీకి దగ్గర చేసి, 2024 తాను బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. చివరకు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్... అన్నట్టు రఘురామ పరిస్థితి తయారైంది.
ఆధిపత్యం కోసం బీజేపీతో దోస్తీ…
తాను అందరి లాంటి వాడిని కాదనే భావనలో ఉండే రఘురామ, మొదటి సారి ఎన్నికయ్యే ఎంపీలకు ఇచ్చే ఫ్లాట్ కాకుండా పెద్ద క్వార్టర్ కోసం ప్రయత్నించారు. చివరకు దానిని సాధించారు. ఆ విషయంలో కూడా వైసీసీ అధిష్టానంతో ఆయనకు గ్యాప్ వచ్చినట్టు చెబుతారు.
వైసీపీతో గొడవలు మొదలయ్యాక దాదాపు నాలుగున్నరేళ్లుగా సొంత నియోజక వర్గానికి పోలేకపోయారు. చివరకు సొంత ఊరికి రావడానికి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.
జగన్ మీద, వైసీపీ మీద పంతం నెగ్గించుకోడానికి బాబును బీజేపీకి దగ్గర చేయడం, చంద్రబాబు కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను ఏకం చేయడం వంటివి విజయవంతంగా చేయగలిగాడు. బీజేపీ అగ్రనాయకులు తనకు సన్నిహితులు అని ప్రచారం చేసుకోడానికి తాపత్రయ పడ్డారు.
ఎన్నికైన మొదటి ఏడాదే రాజ్‌నాథ్ సింగ్‌తో ఉయ్యాలలో కలిసి కూర్చుని మీడియాకు ఫోజులివ్వడం ద్వారా వైసీపీ కంటే తానే బీజేపీకి క్లోజ్ అని చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేశారు. తనపై అనర్హత వేటు వేయలేరని వైసీపీకి పదేపదే సవాలు చేసి రెచ్చగొట్టే వారు.
బీజేపీకి తాను బాగా దగ్గర అని రఘురామ ఊహించుకుంటే,ఆ పార్టీ మాత్రం ఆయన విషయంలో పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. మరోవైపు నాలుగేళ్లుగా టీడీపీ చేయలేని అవినీతి ప్రచారం రఘురామ ద్వారా ఆ పార్టీకి దక్కింది. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి మాత్రం టిక్కెట్ కూడా దక్కలేదు.
నిజానికి రఘురామకు అసలు బీజేపీ సభ్యత్వమే లేదని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రాథమిక సభ్యత్వమే లేకుండా ఆ పార్టీలో టిక్కెట్ ఆశించారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏడాది క్రితమే బీజేపీలో చేరాల్సిందిగా పార్టీ సూచించినా ఆ పని చేయలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తిరుపతి అభ్యర్థి వరప్రసాద్ పార్టీలో చేరిన రోజే టిక్కెట్ దక్కించుకున్నారు.
ప్రజల్లో తేల్చుకుంటానన్న రఘురామ
ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం లేదని తెలిసిన తర్వాత రఘురామ నిరాశ చెందారు. అయితే ప్రజాక్షేత్రంలో ఉంటానని ప్రకటించారు. ఎంపీ రఘు రామకృష్ణరాజు తెలిపారు.
నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా.. పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించడంపై వీడియో విడుదల చేశారు. తాను ఎలాంటి ఆందో ళనలో లేనని, ఆనందంగా కూడా చెప్పడం లేదని వెల్లడించారు. టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని, అపజయాన్ని అంగీకరిస్తున్నానని వెల్లడించారు.
జగన్ ఇంత పని చేస్తారనితెలిసినా, ఏ మూలనో నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నట్టు చెప్పారు.బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమి విజయం సాధి స్తుందన్నారు.