Jasprit Bumrah World Number 1: బుమ్రా వరల్డ్ నంబర్ 1 బౌలర్.. విశాఖపట్నం టెస్ట్ తర్వాత టీమిండియా పేస్ బౌలర్ ఘనత
Jasprit Bumrah World Number 1: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో కొత్త వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయ్యాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు తీసుకున్న బుమ్రా.. ఈ ఘనత సాధించాడు.
Jasprit Bumrah World Number 1: ఐసీసీ తాజాగా బుధవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా నంబర్ వన్ గా నిలిచాడు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో తన నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిన బుమ్రా.. టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ అయిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
బుమ్రా.. నంబర్ వన్
ఇంగ్లండ్ తో రెండో టెస్టు గెలవడంలో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన బుమ్రా.. ఇప్పుడు టెస్టు ర్యాంకుల్లోనూ నంబర్ వన్ అయ్యాడు. గతంలో ఏ ఇండియన్ పేస్ బౌలర్ టెస్టుల్లో ఈ ఘనత సాధించలేదు. రవిచంద్రన్ అశ్విన్, జడేజా, బిషన్ సింగ్ బేడీ మాత్రమే ఇంతకుముందు ఈ ర్యాంకు అందుకున్నారు. ఈ ముగ్గురూ స్పిన్ బౌలర్లే.
ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టుల్లో బుమ్రా 9 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో అతడు 6 వికెట్లు తీసుకొని.. టీమిండియాకు మంచి ఆధిక్యం దక్కేలా చేశాడు. ఆ ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ ను ఔట్ చేయడానికి బుమ్రా వేసిన యార్కర్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ లక్ష్యాన్ని తన బజ్‌బాల్ స్టైల్లో చేజ్ చేయడానికి ప్రయత్నించిన ఇంగ్లండ్ ను తన పదునైన పేస్ తో అడ్డుకున్నాడు.
బుమ్రా.. వరల్డ్ క్లాస్ బౌలర్
ఇంగ్లండ్ తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు బుమ్రా నాలుగో ర్యాంకులో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 9 వికెట్లతో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్ లోకి వచ్చాడు. గతంలో బుమ్రా బెస్ట్ ర్యాంక్ మూడే. అయితే ఈ మ్యాచ్ లో తన పేస్ బౌలింగ్ పదునెంతో అతడు మరోసారి ప్రపంచానికి చూపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రా వేసిన యార్కర్ చూసి ఈ బాల్ వేయడంలో కింగ్ గా పేరుగాంచిన పాక్ మాజీ బౌలర్ వకార్ యూనిస్ కూడా అతన్ని పొగడకుండా ఉండలేకపోయాడు.
బుమ్రా ఈ మ్యాచ్ లో 91 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీయడంతో టీమిండియా 101 పరుగులతో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది. ఇండియాలో బుమ్రా ఆడిన ఆరో టెస్టు ఇది. అయినా ఈ ఆరు మ్యాచ్ లలోనే అతడు ఏకంగా 29 వికెట్లు తీసుకున్నాడు. స్వదేశంలో అతని సగటు కేవలం 13.06 కావడం గమనార్హం. మొత్తంగా ఇప్పటి వరకూ బుమ్రా 34 మ్యాచ్ లలో 155 వికెట్లు తీసుకున్నాడు.
ఇక గతేడాది మార్చి నుంచి నంబర్ వన్ గా ఉన్న అశ్విన్.. తాజా ర్యాంకుల్లో మూడో స్థానానికి పడిపోయాడు. సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడా రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అశ్విన్ రెండో టెస్టులో మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు టెస్టుల్లో 499 వికెట్లతో ఉన్నాడు. రాజ్‌కోట్ లో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో 500వ వికెట్ మైలురాయి కోసం ఎదురు చూస్తున్నాడు.
యశస్వి 37 స్థానాలు పైకి..
మరోవైపు రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తాజా ర్యాంకుల్లో 37 స్థానాలు ఎగబాకాడు. తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ 209 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజా ర్యాంకుల్లో 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో విఫలమైన జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ రెండోస్థానానికి చేరాడు.