India vs Zimbabwe T20 Series: టీ20 వరల్డ్ కప్ ముగియగానే టీమిండియా ఐదు టీ20ల సిరీస్
India vs Zimbabwe T20 Series: టీ20 వరల్డ్ కప్ ముగియగానే టీమిండియా మరో టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లనుంది. ఈ టూర్ షెడ్యూల్ ను మంగళవారం (ఫిబ్రవరి 6) బీసీసీఐ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో వెల్లడించింది.
India vs Zimbabwe T20 Series: టీమిండియా ఈ ఏడాది మరోసారి జింబాబ్వే టూర్ కు వెళ్లనుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగబోయే టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐదు టీ20ల సిరీస్ కోసం ఈ ఆఫ్రికన్ దేశంలో ఇండియన్ క్రికెట్ టీమ్ పర్యటించనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ ను మంగళవారం (ఫిబ్రవరి 6) బీసీసీఐ వెల్లడించింది.
జింబాబ్వేలో టీమిండియా టూర్ ఇదే
జింబాబ్వేలో ఇండియా పది రోజుల షార్ట్ టూర్ ఉండనుంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారంలోపే ఐదు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. జులై 6 నుంచి 14 మధ్య జింబాబ్వే రాజధాని హరారేలోనే ఈ ఐదు టీ20ల సిరీస్ ను టీమిండియా ఆడనుంది. 2022 తర్వాత ఆ దేశ పర్యటనకు తొలిసారి ఇండియన్ టీమ్ వెళ్తోంది. ఈ ఐదు మ్యాచ్ లలో తొలి రెండు మ్యాచ్ లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు, మిగిలిన మూడు మ్యాచ్ లు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి.
జులై 6న ఇండియా, జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జులై 7, జులై 10, జులై 13, జులై 14వ తేదీల్లో మిగిలిన నాలుగు టీ20లు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. ఇండియా సిరీస్ నిర్వహిస్తుండటం చాలా థ్రిల్ గా ఉందని జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తావెంగ్వా ముకులానీ అన్నారు. 2010 తర్వాత జింబాబ్వేలో టీమిండియా ఆడబోతున్న ఐదో ద్వైపాక్షిక సిరీస్ ఇది.
టీమిండియా బిజీ బిజీ
2015, 2016లలో జింబాబ్వే వెళ్లిన ఇండియన్ టీమ్.. రెండుసార్లూ సిరీస్ లు గెలిచింది. ఇక చివరిసారి 2022లో మూడు వన్డేల సిరీస్ కోసం కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వెళ్లి 3-0తో సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది మరోసారి ఆ దేశ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటి వరకూ ప్రతిసారీ ఆ దేశానికి సెకండ్ రేట్ జట్టునే బీసీసీఐ పంపిస్తోంది.
అయితే అదే జులై నెల చివర్లో శ్రీలంక టూర్ కు కూడా ఇండియా వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇప్పుడు జింబాబ్వే టూర్ మధ్యలో వచ్చి చేరడంతో ఆ సిరీస్ ను ఆగస్ట్ కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సిరీస్ ముగిసిన వెంటనే స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.
ఆ తర్వాత అక్టోబర్ లో మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ టీమ్ ఇండియాకు రానుంది. అది ముగిసిన వెంటనే ఐదు టెస్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు మన టీమ్ వెళ్తుంది. మొత్తానికి ఈ ఏడాదంతా టీమిండియా ప్లేయర్స్ బిజీబిజీగా గడపనున్నారు. ఇంగ్లండ్ తో ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది. అది ముగియగానే ఐపీఎల్, ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ జరుగుతాయి.