T20 World Cup 2024 Ticket Sales: టీ20 వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు షురూ.. తొలిసారి పబ్లిక్ బ్యాలెట్ పద్ధతిలో..
T20 World Cup 2024 Ticket Sales: ఈ ఏడాది జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024 టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. తొలిసారి ఐసీసీ పబ్లిక్ బ్యాలెట్ పద్ధతిని పరిచయం చేసింది. ఇదేంటో చూద్దాం.
T20 World Cup 2024 Ticket Sales: క్రికెట్ అభిమానులు ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ రూపంలో మరో మెగా టోర్నీని ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ టోర్నీ కోసం టికెట్ల అమ్మకాలు శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి ప్రారంభమయ్యాయి. జూన్ 1 నుంచి జూన్ 29 మధ్య టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈసారి పబ్లిక్ బ్యాలెట్ ను ప్రవేశపెట్టింది.
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ను కరీబియన్ దీవులతోపాటు అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1న టోర్నీ ప్రారంభం కానుండగా.. జూన్ 5న టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 55 మ్యాచ్ లు, 9 నగరాల్లో జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం.
టీ20 వరల్డ్ కప్ టికెట్లు పబ్లిక్ బ్యాలెట్ పద్ధతిలో..
టీ20 వరల్డ్ కప్ 2024 టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఐసీసీ ఈసారి పబ్లిక్ బ్యాలెట్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది. అందరు అభిమానులకు టికెట్లు అందాలన్న ఉద్దేశంతో ఈ పద్ధతిని తీసుకొస్తున్నారు. ముందు ఎవరు వస్తే వాళ్లకే టికెట్లు అన్నది సాధారణంగా ఎక్కడైనా అనుసరించే విధానం.
కానీ ఈ పబ్లిక్ బ్యాలెట్ అలా కాదు. శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి స్థానిక ఆంటిగ్వా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 11.59 గంటల వరకూ ఎవరైతే తమ అప్లికేషన్లను సబ్‌మిట్ చేస్తారో అందరూ టికెట్లు పొందే అవకాశం సమానంగా ఉంటుంది. ఒక్కో అభిమాని గరిష్ఠంగా ఆరు టికెట్ల కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే మ్యాచ్ లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. ఒక అభిమాని ఎన్ని మ్యాచ్ ల కోసమైనా టికెట్లు తీసుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్ 2024 టికెట్ల ధరలు
ఇక టీ20 వరల్డ్ కప్ టికెట్ల ధరలను కూడా అందరికీ అందుబాటులోనే ఉంచాలన్న ఉద్దేశంతో వాటిని సెట్ చేశారు. కనీస టికెట్ ధర 6 డాలర్లు కాగా.. గరిష్ఠంగా 25 డాలర్లుగా ఉంది. కరీబియన్ దీవులతోపాటు అమెరికాలో క్రికెట్ ను అందరికీ చేరువ చేయాలని భావిస్తున్న ఐసీసీ.. టికెట్లతోపాటు వాటి ధరలను కూడా అందుబాటులోనే ఉంచింది.
పబ్లిక్ బ్యాలెట్ తర్వాత కూడా ఒకవేళ టికెట్లు మిగిలితే.. వాటిని ఫిబ్రవరి 22 నుంచి tickets.t20worldcup.com అధికారిక వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తారు. పబ్లిక్ బ్యాలెట్లలో టికెట్లు పొందిన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఒకవేళ వాళ్లు చెప్పిన గడువులోగా పేమెంట్ చేయకపోతే.. ఆ టికెట్లను మళ్లీ సాధారణ టికెట్లలా వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా షెడ్యూల్
టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా గ్రూప్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు ఆడుతుంది. ఈసారి పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడాలతో కలిసి ఇండియా గ్రూప్ ఎలో ఉంది. జూన్ 5న ఐర్లాండ్ తో న్యూయార్క్ లో ఇండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. తర్వాత జూన్ 9న న్యూయార్క్ లోనే పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత జూన్ 12న న్యూయార్క్ లోనే యూఎస్ఏతో, జూన్ 15న ఫ్లోరిడాలో కెనడాతో ఆడనుంది.