India vs Pakistan T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆరోజే..
India vs Pakistan T20 World Cup 2024: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌లో మరోసారి ఎంతో ఆసక్తి రేపుతున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరగబోతోంది? తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. జూన్ 9న ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
India vs Pakistan T20 World Cup 2024: ఈ ఏడాది జూన్ నెలలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే కదా. అయితే ఈ మెగా టోర్నీలో మరోసారి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎంతో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జూన్ 9న జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా గ్రూప్ ఎలో ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇండియాతోపాటు పాకిస్థాన్, ఆతిథ్య యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా కూడా ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 4 నుంచి జూన్ 30 వరకు ఈ టోర్నీ జరగబోతోంది. గ్రూప్ ఎలో సహజంగానే దాయాదుల మ్యాచ్ లపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 ఆసియా కప్, వరల్డ్ కప్ లలో తలపడిన ఇండోపాక్ టీమ్స్.. ఈ ఏడాది మరోసారి ఫేస్ టు ఫేస్ తలపడబోతోన్నాయి.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎక్కడ?
ది టెలిగ్రాఫ్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. ఈ మ్యాచ్ కు న్యూయార్క్ లోని ఐసెన్‌హోవర్ పార్క్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. ఇక ఇదే రిపోర్టు ప్రకారం.. ఇండియా తన తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడనుంది. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇండియా, పాకిస్థాన్ ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో తలపడిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్ తో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. గతేడాది కూడా వన్డే ఫార్మాట్లో మూడు మ్యాచ్ లలో ఈ టీమ్స్ తలపడగా.. రెండింట్లో ఇండియా గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ ఇలా
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్ పూర్తి భిన్నంగా ఉండనుంది. సెమీఫైనల్స్, ఫైనల్ కు ముందు గ్రూప్ స్టేజ్ తోపాటు సూపర్ 8 స్టేజ్ కూడా జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి 20 జట్లు టీ20 వరల్డ్ కప్ లో తలపడనున్నాయి. వీటిని ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపు నుంచి రెండేసి జట్లు సూపర్ 8 స్టేజ్ కు వెళ్తాయి.
ఈ సూపర్ 8 నుంచి టాప్ 4 టీమ్స్ సెమీఫైనల్స్ లో అడుగుపెడతాయి. సూపర్ 8 కోసం డ్రా ముందుగానే అనౌన్స్ చేస్తారు. టాప్ 8 సీడింగ్స్ జట్ల ఆధారంగా ఈ డ్రా రూపొందిస్తారు. ఒకవేళ ఈ సీడింగ్స్ లో లేని టీమ్స్ సూపర్ 8లోకి వస్తే.. ఆ టీమ్ గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ చేసిన జట్టు సీడింగ్ దీనికి వర్తిస్తుంది.
ఆ స్టేడియం సరైనదేనా?
ఇండియా, పాకిస్థాన్ లాంటి హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఐసీసీ ఎంపిక చేసిన స్టేడియమే ఆందోళనకు గురి చేస్తోంది. అసలు క్రికెట్ అంటే తెలియని న్యూయార్క్ నగరం శివార్లలో ఉన్న ఓ సాదాసీదా గ్రౌండ్ అది. ప్రత్యేకంగా ఈ మ్యాచ్ కోసమే అక్కడ తాత్కాలికంగా స్టాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు.
న్యూయార్క్ లో 7 లక్షలకుపైగా ఉన్న ఇండియన్స్, లక్షకుపైగా ఉన్న పాకిస్థానీలను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్ కోసం ఈ నగరాన్ని ఐసీసీ ఎంపిక చేసింది. అయితే అక్కడి క్రికెట్ వసతులు మాత్రం ఇంతటి హైఓల్టేజ్ మ్యాచ్ కు ఏమాత్రం సరిపోని విధంగా ఉన్నాయి.