T20 World Cup 2024 Qualified Teams: టీ20 వరల్డ్ కప్ 2024లో తలపడబోయే మొత్తం 20 టీమ్స్ ఏవో తెలిసిపోయాయి. చివరిగా గురువారం (నవంబర్ 30) ఆఫ్రికా టీమ్ ఉగాండా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు షాకిచ్చిన జింబాబ్వే ఈసారి కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది.
టీ20 వరల్డ్ కప్ 2024 వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకూ వెస్టిండీస్, అమెరికాల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పది టీమ్స్ నేరుగా అర్హత సాధించగా.. మరో పది జట్లు క్వాలిఫయింగ్ రౌండ్ల ద్వారా వచ్చాయి. గురువారం ఉగాండా టీమ్ అర్హత సాధించడంతో ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 20 జట్లు ఏవో తెలిసిపోయాయి.
ఓవైపు టీ20 వరల్డ్ కప్ కు తొలిసారి అర్హత సాధించి ఉగాండా సంచలనం సృష్టించగా.. మరోవైపు ఐసీసీ ఫుల్ మెంబర్ అయిన జింబాబ్వే మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. ఆఫ్రికా క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి స్థానంలో నమీబియా, రెండో స్థానంలో ఉగాండా నిలిచి టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. ఇక జింబాబ్వే 5 మ్యాచ్ లలో 3 విజయాలతో మూడో స్థానంలో నిలిచి ఛాన్స్ మిస్ అయింది.
ఈ టోర్నీలో ఉగాండా టీమ్ జింబాబ్వేను కూడా ఓడించింది. ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యదేశంపై ఉగాండా గెలవడం ఇదే తొలిసారి. ఆ టీమ్ తాను ఆడిన 6 మ్యాచ్ లలో 5 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందే నమీబియా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఆఫ్రికా ఖండం నుంచి వరల్డ్ కప్ ఆడబోతున్న ఐదో జట్టుగా ఉగాండా నిలవనుంది.
వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. 20 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. అందులో టాప్ 4 టీమ్స్ సూపర్ 8 స్టేజ్ కు అర్హత సాధిస్తాయి. అక్కడి నుంచి సెమీస్ కు వెళ్తాయి.
ఇండియా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, కెనడా, ఒమన్, నేపాల్, నమీబియా, ఉగాండా