ODI Player Of The Year 2023: వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023 రేసులో ముగ్గురు టీమిండియా ప్లేయర్స్
ODI Player Of The Year 2023: వన్డే ప్లేయర్ ఆఫ్ ఇయర్ 2023 రేసులో ముగ్గురు టీమిండియా ప్లేయర్స్ ఉండటం విశేషం. విరాట్ కోహ్లితోపాటు గిల్, షమి ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు
ODI Player Of The Year 2023: టీమిండియా 2023లో ఎలా చెలరేగిందో మనం చూశాం. టీమ్ లోని కొందరు ప్లేయర్స్ కెరీర్లోనే అత్యద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో గతేడాది అద్వితీయమైన విజయాలను సొంతం చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ కూడా చేరింది. దీంతో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023 కోసం నలుగురు ప్లేయర్స్ ను షార్ట్‌లిస్ట్ చేయగా.. అందులో ముగ్గురు ఇండియన్ ప్లేయర్సే కావడం విశేషం.
2023 విరాట్ కోహ్లికి మరుపురాని ఏడాదిగా చెప్పొచ్చు. అతడు వన్డేల్లో 50వ సెంచరీతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో సహజంగానే వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లి పేరు ఉంది. అతనితోపాటు వరల్డ్ కప్ లో రాణించిన మహ్మద్ షమి, 2023లో వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.
ఈ ముగ్గురు ఇండియన్స్ కాకుండా న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. మిచెల్ కూడా వరల్డ్ కప్ 2023లో రాణించాడు.
ఆ ముగ్గురూ సూపర్ హిట్
టీమిండియా నుంచి నామినేట్ అయిన ముగ్గురిలో ఓపెనర్ గిల్ గతేడాది అత్యధిక స్కోరర్. 2023లో వన్డేల్లో గిల్ ఏకంగా 63.36 సగటుతో 1584 రన్స్ చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గిల్ పేరిట రికార్డు కూడా ఉంది. 2023 మొదట్లోనే హైదరాబాద్ లో న్యూజిలాండ్ పై అతడు 208 రన్స్ చేశాడు.
ఇక వరల్డ్ కప్ లో లేటుగా ఎంట్రీ ఇచ్చి చెలరేగిపోయాడు పేస్ బౌలర్ మహ్మద్ షమి. 24 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో 57 పరుగులకే 7 వికెట్లు తీసుకొని.. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రేసులో షమి ఉన్నాడు.
ఇక 2022లో మళ్లీ సెంచరీల బాట పట్టిన విరాట్ కోహ్లి.. 2023లో అదే ఫామ్ కొనసాగించాడు. వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అతడే. 765 రన్స్ తో వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక ఎడిషన్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 11 మ్యాచ్ లలో 9 మ్యాచ్ లలో 50, అంతకన్నా ఎక్కువ స్కోర్లు చేశాడు. సెమీఫైనల్లో వన్డేల్లో 50వ సెంచరీ చేశాడు.
ఇక న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ విషయానికి వస్తే అతడు 2023లో 1204 రన్స్ చేశాడు. వరల్డ్ కప్ లోనూ అతడు 69 సగటుతో 552 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. గురువారం (జనవరి 4) ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో ఉన్న ప్లేయర్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేయగా.. అందులో ఇండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.