Sachin on Virat Kohli: నా రికార్డు ఓ ఇండియన్ బ్రేక్ చేసినందుకు గర్వంగా ఉంది: సచిన్ టెండూల్కర్
Sachin on Virat Kohli: విరాట్ కోహ్లి 50వ వన్డే సెంచరీ చేయడంపై సోషల్ మీడియా ద్వారా సచిన్ టెండూల్కర్ స్పందించాడు. తన రికార్డు ఓ ఇండియన్ బ్రేక్ చేసినందుకు గర్వంగా ఉందని అతడు అనడం విశేషం.
Sachin on Virat Kohli: వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డు బ్రేక్ అయింది. అసాధ్యమనుకున్న ఈ రికార్డును విరాట్ కోహ్లి బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ తో బుధవారం (నవంబర్ 15) జరిగిన సెమీఫైనల్లో 50వ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోహ్లి తన రికార్డు బ్రేక్ చేసిన తర్వాత సచిన్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
తన రికార్డును ఓ ఇండియన్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని సచిన్ అన్నాడు. "నేను ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో తొలిసారి నిన్ను కలిసినప్పుడు ఇతర టీమ్మేట్స్ నిన్ను నా పాదాలను తాకేలా చేశారు. నేను ఆ రోజు నవ్వు ఆపుకోలేకపోయాను.
కానీ తర్వాత త్వరలోనే నీ ప్యాషన్, స్కిల్ తో నువ్వు నా మనసును తాకావు. ఓ యువకుడు ఇప్పుడు విరాట్ ప్లేయర్ గా ఎదిగినందుకు సంతోషంగా ఉంది. ఓ ఇండియన్ నా రికార్డు బ్రేక్ చేయడానికి మించిన సంతోషం మరొకటి లేదు. అందులోనూ వరల్డ్ కప్ సెమీఫైనల్, నా సొంతగడ్డపై చేయడం మరింత ఆనందంగా ఉంది" అని సచిన్ ట్వీట్ చేశాడు.
ఇండియా ఇన్నింగ్స్ తర్వాత కూడా విరాట్ కోహ్లిని వ్యక్తిగతంగా కలిసిన సచిన్ అతన్ని అభినందించాడు. మరోవైపు మాస్టర్ రికార్డు బ్రేక్ చేయడంపై కోహ్లి కడా స్పందించాడు. అంతా కలలాగా ఉందని అతడు అన్నాడు. "ఆ గొప్ప వ్యక్తి నన్ను ఇంతకుముందే అభినందించాడు. అంతా కలలాగా ఉంది. ఇది మాకు పెద్ద మ్యాచ్. నేను నాకు ఇచ్చిన రోల్ పోషించాను. నాకు అన్నింటికన్నా జట్టును గెలిపించడమే ముఖ్యం. 400 వరకూ స్కోరు చేయడం చాలా సంతోషంగా ఉంది" అని కోహ్లి అన్నాడు.
మరోవైపు ఇదే ఇన్నింగ్స్ లో ఒక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (673 రన్స్, 2003 వరల్డ్ కప్ లో) రికార్డును కూడా విరాట్ బ్రేక్ చేశాడు. అతడు ఈ వరల్డ్ కప్ 10 ఇన్నింగ్స్ లో 711 పరుగులు చేయడం విశేషం.