Virat Kohli 50 Centuries: వందనం విరాట్.. అద్భుత చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. సచిన్ అపూర్వ రికార్డు బద్దలు
Virat Kohli 50 ODI Centuries: విరాట్ కోహ్లీ అత్యద్భుత రికార్డు దక్కించున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అనన్య సామాన్యమైన చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును కింగ్ కోహ్లీ బద్దలుకొట్టాడు.
Virat Kohli 50 ODI Centuries: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనన్య సామాన్యమైన ఘనత సాధించాడు. ఎవరికీ సాధ్యం కాదనుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49 వన్డే శతకాలు) వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‍లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 50 శతకాలు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు కింగ్ కోహ్లీ. ముంబై వేదికగా నేడు (నవంబర్ 15) న్యూజిలాండ్‍తో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో విరాట్ కోహ్లీ ఈ అద్భుత ఘనత సాధించాడు. 50వ వన్డే శతకాన్ని ఈ మ్యాచ్‍లో పూర్తి చేసుకున్నాడు. సచిన్ అత్యధిక వన్డే శతకాల రికార్డును కింగ్ కోహ్లీ బద్దలుకొట్టాడు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 452 వన్డే ఇన్నింగ్స్‌లో 49 సెంచరీలు చేస్తే.. విరాట్ కోహ్లీ 279 ఇన్నింగ్స్‌లోనే 50 వన్డే శతకాలు పూర్తి చేసుకున్నాడు. అత్యద్భుత రికార్డు సృష్టించాడు.
ఈ సెమీస్ మ్యాచ్‍లో 106 బంతుల్లో శతకానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. 50 వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెంచరీకి చేరాక తన మార్క్ సంబరాలు చేసుకున్నాడు. గాల్లోకి సింహంలా జంప్ చేసి విజయనాదం చేశాడు.
స్టేడియంలో ఈ మ్యాచ్ చూస్తున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అభివనందం చేశాడు విరాట్ కోహ్లీ. సచిన్ పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సచిన్ సొంత మైదానం వాంఖడేలోని అతడి అపూర్వ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటానంటూ టెండూల్కర్‌కు సలామ్ చేశాడు.
తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. భర్త అద్భుతమైన రికార్డు సాధించటంతో సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు అనుష్క. ఇక, కోహ్లీ 50 శతకం చేశాక వాంఖడే స్టేడియం మోతెక్కిపోయింది. ప్రేక్షకుల హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది.
2009లో శ్రీలంకపై కోల్‍కతాలో తొలి వన్డే శకతం చేశాడు విరాట్ కోహ్లీ. 14 ఏళ్లలోనే 50వ శతకానికి చేరాడు. అందులోనూ అతి ముఖ్యమైన వన్డే ప్రపంచకప్ 2023 సెమీస్‍లో సెంచరీ చేసి.. జట్టుకు భారీ స్కోరు అందించాడు.