Mohammed Shami: నేనొక ఇండియన్ ముస్లిం అయినందుకు గర్విస్తున్నా: మహ్మద్ షమి
Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు మరోసారి దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. తాను ఇండియన్ ముస్లిం అయినందుకు గర్విస్తున్నానని అతడు అన్నాడు.
Mohammed Shami: వరల్డ్ కప్‌లో ఇండియా తరఫున అద్భుతంగా రాణించిన పేస్ బౌలర్ మహ్మద్ షమి తనపై పాకిస్థాన్ నుంచి జరిగిన ట్రోలింగ్ పై స్పందించాడు. తాను ఓ ఇండియన్, ముస్లిం అయినందుకు గర్విస్తున్నా అని స్పష్టం చేశాడు. బుధవారం (డిసెంబర్ 13) ఆజ్ తక్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ లో శ్రీలంకతో మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన తర్వాత మహ్మద్ షమి మోకాళ్లపై కూర్చున్నాడు. అయితే ఆ సందర్భంలో అతడు నమాజ్ చేయాలనుకొని ఆగిపోయాడని, ఇండియాలో ఉన్నాడు కాబట్టే అతడు భయపడ్డాడని పాకిస్థాన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీనికి షమి తన తాజా ఇంటర్వ్యూలో గట్టి సమాధానం ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే..
ఈ ఇంటర్వ్యూలో భాగంగా షమిని ఓ ప్రశ్న అడిగారు. శ్రీలంకతో మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన తర్వాత షమి మోకాళ్లపై కూర్చొని నమాజ్ చేద్దామనుకున్నా ఇండియా కావడంతో భయపడ్డాడన్న విమర్శలు వచ్చాయి.. దీనిపై ఏమంటారు అని ప్రశ్నించారు. దీనికి షమి స్పందిస్తూ.. తాను నిజంగా అలా చేయాలనుకుంటే ఆపేవారు ఎవరు అని అన్నాడు.
"ఎవరైనా ప్రార్థించాలని అనుకుంటే ఆపేవారు ఎవరు? నేను ఇతరులను అలా చేయకుండా ఆపను. నన్ను కూడా ఇతరులు ఆపరు. ఒకవేళ నేను నమాజ్ చేయాలని అనుకుంటే చేసేవాడిని. అందులో సమస్య ఏముంది? నేనో ముస్లిం, నేనో ఇండియన్ అని గర్వంగా చెబుతాను" అని షమి స్పష్టం చేశాడు.
"ఒకవేళ నాకు సమస్య ఉంటే నేను ఇండియాలో జీవించే వాడినే కాదు. నమాజ్ చేయడానికి నేను ఎవరి అనుమతో తీసుకోవాల్సి వస్తే.. నేను ఇక్కడ ఎందుకు ఉంటాను. నేను కూడా సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ చూశాను. నేను గ్రౌండ్ లో ఎప్పుడైనా నమాజ్ చేశానా? అంతకుముందు కూడా ఐదు వికెట్లు తీసుకున్నా.. ఎప్పుడూ నమాజ్ చేయలేదు. నేను ఒకవేళ నమాజ్ చేయాలంటే.. చెప్పండి ఎక్కడ చేయాలంటే అక్కడ చేస్తా" అని షమి అన్నాడు.
ఇండియాలో తాను ఎక్కడ కావాలన్నా చేస్తానని, తనను ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పాడు. వాళ్లు విభేదాలు సృష్టించడానికే ఉన్నారని, వాళ్లు ఎవరినీ ప్రేమించరని షమి అన్నాడు. తాను అలసిపోయాను కాబట్టే అలా మోకాళ్లపై కూర్చున్నానని, కానీ వాళ్లు మాత్రం ఏవేవో కథలు అల్లారని అన్నాడు.