Rohit Sharma on WC Final: ఆ ఓటమి తర్వాత కోలుకోలేకపోయాను: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్
Rohit Sharma on WC Final: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ ఓటమి తర్వాత తాను కోలుకోలేకపోయానని చెప్పాడు.
Rohit Sharma on WC Final: వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన సుమారు నెల రోజుల తర్వాత తొలిసారి ఆ ఓటమిపై స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఓ వీడియోలో మాట్లాడిన రోహిత్.. ఆ ఓటమి తనను ఎంతలా కుంగదీసిందో చెప్పాడు. అయితే అభిమానులు చూపించిన ప్రేమే ఆ బాధ నుంచి కోలుకునేలా చేసిందని తెలిపాడు.
నవంబర్ 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు వరుసగా పది విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా.. ఫైనల్లో ఓడటంతో రోహిత్ కంటతడి పెట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరి కంటా పడని రోహిత్.. ఇన్నాళ్లకు నోరు విప్పాడు. వరల్డ్ కప్ గెలవలేకపోయినందుకు తాను ఎంతలా బాధపడిందీ చెప్పుకొచ్చాడు.
అభిమానుల వల్లే కోలుకున్నా: రోహిత్
ఫైనల్లో ఓటమిని తాను జీర్ణించుకోలేకపోయినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. "ఆ ఫైనల్ తర్వాత నేను కోలుకోలేకపోయాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేశారు. దాని నుంచి కోలుకోవడానికి ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నాను. కానీ ఎక్కడికెళ్లినా అభిమానులు నా దగ్గరికి వచ్చి అందరూ ఎంతో బాగా ఆడారని అభినందించారు.
వాళ్లను చూసి బాధగా అనిపించింది. మాతోపాటు వాళ్లు కూడా వరల్డ్ కప్ గెలవాలని ఎన్నో కలలు కన్నారు. మాకు మద్దతుగా నిలిచారు. వరల్డ్ కప్ లో మేము వెళ్లిన ప్రతి చోటా ఫ్యాన్స్ మాకు అండగా నిలిచారు. ఇందుకు వాళ్లను అభినందించాల్సిందే. కానీ దాని గురించి ఆలోచించిన ప్రతిసారీ ఎంతో నిరాశ కలుగుతోంది" అని రోహిత్ అన్నాడు.
అయితే ఈ ఓటమి తర్వాత కూడా అభిమానులు తమ ఆగ్రహం వెల్లగక్కకుండా అభినందించడం తనను కోలుకునేలా చేసిందని రోహిత్ తెలిపాడు. "నా వరకూ అభిమానులు నా దగ్గరికి వచ్చి టీమ్ ను చూసి గర్విస్తున్నాం అని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. వాళ్లతోపాటు నేను కూడా కోలుకున్నాను. ఇలాంటివే కదా మనం వినాలని అనుకునేవి అనిపించింది.
ఇలాంటి సమయంలో ప్లేయర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని తమ ఆగ్రహం వెల్లగక్కకుండా స్వచ్ఛమైన ప్రేమను పంచడం చాలా బాగా అనిపించింది. అదే నేను మళ్లీ కోలుకొని సాధారణ జీవితం గడిపేలా ప్రోత్సహించింది" అని రోహిత్ తెలిపాడు.