ICC: 2023 ‘టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించిన ఐసీసీ.. కెప్టెన్‍గా భారత స్టార్
ICC T20I Team of The Year: 2023కు గాను ‘టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్’ను ఐసీసీ ప్రకటించింది. ఈ టీమ్‍లో నలుగురు టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్‍గా కూడా భారత స్టార్‌నే తీసుకుంది ఐసీసీ.
ICC T20I Team of The Year: 2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‍లో అద్భుతంగా ఆడిన వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో ‘టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్’ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. 2023 గాను 11 ఆటగాళ్లకు ఈ టీమ్‍లో చోటిచ్చింది. భారత్ నుంచి నలుగురు ప్లేయర్లు.. ఈ ‘టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఉన్నారు. ఈ జట్టుకు కెప్టెన్‍గా భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‍ను ఐసీసీ ప్రకటించింది.
‘2023 టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్’లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, ఉగాండా నుంచి ఒక్కో ఆటగాడు ఉన్నాడు. జింబాబ్వే నుంచి ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఇక, భారత్ నుంచి ఈ టీమ్‍లో ఏకంగా నలుగురు ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, రవి బిష్ణోయ్, యశస్వి జైస్వాల్, అర్షదీప్ సింగ్ ఈ టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఉన్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో గతేడాది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‍ల్లో భారత్‍కు కెప్టెన్సీ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఆసీస్‍పై సిరీస్‍ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సమమైంది. 2023లో టీ20ల్లో బ్యాటింగ్‍లోనూ సూర్యకుమార్ యాదవ్ సత్తాచాటాడు. ఓ సెంచరీ కూడా చేశాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్‍ల్లో టాప్ ర్యాంకర్‌గా ఉన్నాడు.
భారత్ తరఫున గతేడాది టీ20ల్లో అరంగేట్రం చేశాడు యశస్వి జైస్వాల్. 14 మ్యాచ్‍ల్లో 430 పరుగులతో దుమ్మురేపాడు. ఏకంగా 159 స్ట్రైక్‍రేట్‍తో అదరగొట్టాడు. ఐదు టీ20ల సిరీస్‍లో 331 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ సాల్ట్ ఫిలిప్‍కు కూడా ఈ టీమ్‍లో చోటు దక్కింది.
భారత యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్‍కు కూడా ‘2023 టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్’ ఉన్నారు. ప్రస్తుతం ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు బిష్ణోయ్. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍లో అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఇక, అర్షదీప్ సింగ్ ఈ ఏడాది భారత్ తరఫున 21 టీ20లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.
వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్, న్యూజిలాండ్ ప్లేయర్ మార్క్ చాంప్‍మన్ కూడా ఈ జట్టులో ఉన్నారు. జింబాబ్వే ఆల్ రౌండర్ సింకర్ రజా, స్పిన్నర్ ఉగాండ ప్లేయర్ అల్పేశ్ రాంజానీ, ఐర్లాండ్ ఆటగాడు మార్క్ అడైర్‌కు చోటు దక్కింది.
ఐసీసీ టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్, మార్క్ చాంప్‍మన్, సికిందర్ రజా, అల్పేశ్ రాంజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ గవారా, అర్షదీప్ సింగ్
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్‍లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. ఈ ప్రపంచకప్ కంటే ముందే మార్చి - మే మధ్య ఐపీఎల్ 2024 కూడా జరగనుంది.