Yashasvi Jaiswal Double Century: యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ ధమాకా.. 191 వద్ద సిక్స్, ఫోర్‌తో..: వీడియో-ind vs eng updates yashasvi jaiswal scores his first double century and india eye bigg score against england in 2nd test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yashasvi Jaiswal Double Century: యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ ధమాకా.. 191 వద్ద సిక్స్, ఫోర్‌తో..: వీడియో

Yashasvi Jaiswal Double Century: యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ ధమాకా.. 191 వద్ద సిక్స్, ఫోర్‌తో..: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 03, 2024 10:34 AM IST

IND vs ENG - Yashasvi Jaiswal Double Century: భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపాడు. ఇంగ్లండ్‍తో రెండో టెస్టులో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. తన కెరీర్లో తొలి ద్విశతకం నమోదు చేసుకున్నాడు.

Yashasvi Jaiswal Double Century: యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సెలెబ్రేషన్స్
Yashasvi Jaiswal Double Century: యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సెలెబ్రేషన్స్ (AFP)

Yashasvi Jaiswal Double Century: భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‍తో జరుగుతున్న రెండో టెస్టులో ద్విశతకంతో సత్తాచాటాడు. తన తొలి అంతర్జాతీయ డబుల్ సెంచరీకి చేరాడు. తన కెరీర్లో ఆరో టెస్టులోనే డబుల్ సెంచరీ చేసి గర్జించాడు 22 ఏళ్ల సంచలనం జైస్వాల్. భారత్, ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజైన నేడు (ఫిబ్రవరి 3) డబుల్ సెంచరీకి చేరాడు జైస్వాల్. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్లు బాది ద్విశతకానికి చేరాడు యశస్వి జైస్వాల్.

బౌండరీతో డబుల్ మార్కుకు..

యశస్వి జైస్వాల్ మరోసారి తన తెగువ చూపాడు. 191 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్ బౌలింగ్‍లో సిక్సర్ బాదేశాడు జైస్వాల్. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నా ఔట్ భయం లేకుండా కొట్టేశాడు. ఫీల్డర్లు బౌండరీల వద్దే ఉన్నా ఆత్మవిశ్వాసంతో ధైర్యం చూపాడు. ఆ తర్వాతి బంతికే ఫోర్ బాదాడు జైస్వాల్. దీంతో డబుల్ సెంచరీకి చేరుకున్నాడు. గాల్లోకి ఎగిరి సెలెబ్రేట్ చేసుకున్నాడు. డెస్సింగ్ రూమ్‍కు, ప్రేక్షకులకు అభివాదం చేశాడు.

176 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నేడు రెండో రోజు ఆటకు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతూ తొలి సెషన్‍లోనే వేగంగా డబుల్ సెంచరీకి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‍లో 209 పరుగులకు (290 బంతుల్లో) జైస్వాల్ ఔటయ్యాడు. దీంతో యశస్వి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ముగిసింది.

రికార్డులు ఇవే..

భారత్ తరఫున టెస్టు డబుల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్నవయస్కుడిగా యశస్వి జైస్వాల్ రికార్డుల్లో నిలిచాడు. వినోద్ కాంబ్లీ (21 ఏళ్ల 32 రోజులు), సునీల్ గవాస్కర్ (21 ఏళ్ల 277 రోజులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. 22 ఏళ్లకే టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసి తన సత్తాను చాటాడు యశస్వి.

టీమిండియా తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో లెఫ్ట్ హ్యాండర్‌ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. వినోద్ కాంబ్లీ, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ ఇంతకు ముందు ఈ ఫీట్ సాధించారు.

జైస్వాల్ వన్‍మ్యాన్ షో

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది.  ఇందులో జైస్వాల్ చేసిన పరుగులే 209 రన్స్ ఉన్నాయి.  ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ తర్వాత టాప్ స్కోర్ శుభమన్ గిల్ చేసిన 34 పరుగులే. మిగిలిన బ్యాటర్లందరూ తడబడిన చోట జైస్వాల్ మాత్రం డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. 

6 వికెట్లకు 336 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నేడు రెండో రోజు ఆటకు టీమిండియా బరిలోకి దిగింది. కాసేపు ధాటిగా ఆడిన రవిచంద్రన్ అశ్విన్ (20) ఔటయ్యాడు. ఆ తర్వాత డబుల్ సెంచరీకి చేరాక యశస్వి వెనుదిరిగాడు. ఇద్దరినీ ఇంగ్లండ్ సీనియర్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సనే ఔట్ చేశాడు. అనంతరం బుమ్రా (6), ముకేశ్ కుమార్ (0) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయారు. దీంతో 396 పరుగుల వద్ద రెండో రోజు మొదటి సెషన్‍లోనే తొలి ఇన్నింగ్స్‌ ముగించింది భారత్. 

IPL_Entry_Point