Shubman Gill: ‘మరిచిపోవద్దు.. అతడు వేచిచూస్తున్నాడు’: గిల్‍కు టీమిండియా మాజీ కోచ్ పరోక్ష వార్నింగ్
IND vs ENG - Shubman Gill: భారత యంగ్ ప్లేయర్ శుభ్‍మన్ గిల్ ఇటీవల ఫామ్ కోల్పోయాడు. వరుసగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలో గిల్‍కు భారత్ మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పరోక్షంగా ఓ వార్నింగ్ ఇచ్చారు.
IND vs ENG - Shubman Gill: భారత్ యంగ్ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ ఏడాది క్రితం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంక, న్యూజిలాండ్‍లతో సిరీస్‍ల్లో అదరగొట్టాడు. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో చెలరేగాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో శతకం బాదాడు. దీంతో కోహ్లీ తర్వాత.. అలాంటి ప్లేయర్ గిల్ అనే కామెంట్లు వినిపించాయి. అయితే, ఇటీవల శుభ్‍మన్ గిల్ ఫామ్ దారుణంగా పడిపోయింది. అతడు వరుసగా విఫలమవుతున్నాడు.
ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లోనూ గిల్ పేలవంగా ఆడుతున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజే తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులకే వెనుదిరిగాడు. టెస్టుల్లో మూడో స్థానంలో సుదీర్ఘ కాలం ఆడిన చతేశ్వర్ పుజారాను పక్కన పెట్టిన టీమిండియా సెలెక్టర్లు.. శుభ్‍మన్ గిల్‍ను ఆ స్థానం కోసం తీసుకుంటున్నారు. అయితే, అతడు వరుసగా విఫలమవుతున్నాడు. ఈ తరుణంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. గిల్‍ను పరీక్షంగా హెచ్చరించారు.
రంజీ ట్రోఫీలో పుజారా అదరగొడుతున్నాడని, అందుకే టీమిండియాలో ఉన్న యువ ఆటగాళ్లు కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుందని రవిశాస్త్రి చెప్పారు. అతడు వేచి చూస్తున్నాడనే విషయాన్ని ఎవరూ మరిచిపోకూడదని భారత్, ఇంగ్లండ్ మధ్య కామెంటరీ చేస్తున్న సమయంలో రవిశాస్త్రి అన్నారు.
“ఇది ఫ్రెష్ టీమ్. యువ జట్టు. ఈ యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవాలి. పుజారా ఎదురుచూస్తున్నాడు.. ఇది మరిచిపోకూడదు. అతడు రంజీ ట్రోఫీలో రాణిస్తున్నాడు. అతడు ఎప్పుడూ రాడార్ (సెలక్షన్ పరిగణన)లో ఉంటాడు” అని రవిశాస్త్రి అన్నారు.
“ఇది టెస్టు మ్యాచ్. చాలా సేపు క్రీజులో ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. బాల్ కోసం రీచ్ అవుతూ హార్డ్ హ్యాండ్స్‌తో ఆడుతున్నావ్. అది కూడా ఆండర్సన్ లాంటి క్లాస్ బౌలర్ బౌలింగ్‍లో” అని శాస్త్రి అన్నారు. ఇంగ్లండ్‍తో రెండో టెస్టు తొలి రోజైన నేడు ఆండర్సన్ బౌలింగ్‍లో కీపర్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు గిల్.
రంజీల్లో పుజారా..
టీమిండియా తరఫున చివరగా గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ ఆడాడు చతేశ్వర్ పుజారా. ఆ తర్వాత అతడిని పక్కన పెట్టి సెలెక్టర్లు గిల్ సహా యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అదరగొడుతున్నాడు పుజారా. ప్రస్తుత రంజీ సీజన్‍లో జార్ఖండ్‍తో మ్యాచ్‍లో డబుల్ సెంచరీ చేశాడు చతేశ్వర్. ఆ తర్వాత వరుసగా రాణించాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధ శతకాలు చేశాడు. మరో ఇన్నింగ్స్‌ల్లో 40కు పైగా రన్స్ చేశాడు. నిలకడగా ఫామ్ కొనసాగిస్తున్నాడు చతేశ్వర్ పుజారా.
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‍లోనూ శుభ్‍మన్ గిల్ విఫలమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‍తో టెస్టులో తొలి మ్యాచ్‍లో తడబడ్డాడు. రెండో మ్యాచ్‍లోనూ దాన్ని కొనసాగించాడు.
ఇంగ్లండ్‍తో రెండో టెస్టు తొలి రోజైన నేడు (ఫిబ్రవరి 2) భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అజేయంగా 179 పరుగులు చేశాడు. ద్విశతకానికి చేరువయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ (5 నాటౌట్) కూడా క్రీజులో ఉన్నాడు.
సంబంధిత కథనం