Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. జడేజా, కేఎల్ రాహుల్ ఔట్.. ఎట్టకేలకు సర్ఫరాజ్‍కు చోటు.. మరో యువ ప్లేయర్ కూడా..-ind vs eng test series indian players ravindra jadeja kl rahul ruled of 2nd test against england sarfaraz khan included ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. జడేజా, కేఎల్ రాహుల్ ఔట్.. ఎట్టకేలకు సర్ఫరాజ్‍కు చోటు.. మరో యువ ప్లేయర్ కూడా..

Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. జడేజా, కేఎల్ రాహుల్ ఔట్.. ఎట్టకేలకు సర్ఫరాజ్‍కు చోటు.. మరో యువ ప్లేయర్ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2024 05:41 PM IST

IND vs ENG Test Series: ఇంగ్లండ్‍తో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుతెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యారు. ముగ్గురు ప్లేయర్లను జట్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ.

Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. జడేజా, కేఎల్ రాహుల్ ఔట్
Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. జడేజా, కేఎల్ రాహుల్ ఔట్ (AFP)

India vs England Test Series: ఇంగ్లండ్‍తో తొలి టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో నాలుగో రోజే 28 పరుగుల తేడాతో పరాజయం చెందింది. కాగా, ఇంగ్లండ్‍తో రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టు నుంచి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యారు. గాయాల కారణంగా వారిద్దరూ వైదొలిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ నేడు (జనవరి 29) అధికారికంగా ప్రకటించింది.

ఇద్దరు కొత్త ప్లేయర్లు

దేశవాళీ క్రికెట్‍లో కొన్నేళ్లుగా పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‍ను తొలిసారి భారత టెస్టు జట్టుకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. దీంతో చాలా కాలంగా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించింది. ఇంగ్లండ్‍తో రెండో టెస్టుకు సర్ఫరాజ్ సెలెక్ట్ అయ్యాడు. అలాగే, ఉత్తర ప్రదేశ్ ఆల్ రౌండర్ సౌరభ్‍ కుమార్‌కు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కింది. ఆల్‍రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా రెండో టెస్టు కోసం సెలెక్టర్లు తీసుకున్నారు. రెండో టెస్టుకు మార్పులతో కూడిన జట్టును బీసీసీఐ వెల్లడించింది.

సర్ఫరాజ్ ఖాన్ 45 రంజీ మ్యాచ్‍ల్లో సుమారు 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లో అదరగొడుతున్న సర్ఫరాజ్‍ను భారత టెస్టు జట్టులోకి తీసుకోవాలని కొంతకాలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు సర్ఫరాజ్ భారత జట్టులోకి వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ టీమ్‍తో జరిగిన అనధికార టెస్టులో ఇండియా-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ 161 పరుగులతో అదరగొట్టాడు.

స్పిన్ ఆల్ రౌండర్ సౌరభ్ కుమార్ కూడా దేశవాళీ క్రికెట్‍లో అదరగొడుతున్నాడు. 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍ల్లోనే 290 వికెట్లతో సత్తాచాటాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌ జట్టుతో జరిగిన అనధికార టెస్టులో ఆరు వికెట్లతో రాణించాడు. దీంతో సౌరభ్ కుమార్‌ను కూడా ఇంగ్లండ్‍తో రెండో టెస్టుకు భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు.

ఐదు టెస్టుల సిరీస్‍లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2న మొదలుకానుంది. తొలి మ్యాచ్‍లో ఓడిన భారత్.. రెండో టెస్టులో గెలిచి సత్తాచాటాలని కసిగా ఉంది.

ఇంగ్లండ్‍తో రెండో టెస్టు కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిజాజ్, ముకేశ్ కుమార్, జస్‍ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్

హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం వచ్చినా.. రెండో ఇన్నింగ్స్‌లో 231 రన్స్ ఛేదించలేకపోయింది. 202 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (87), కేఎల్ రాహుల్ (86) అద్భుతంగా ఆడి అర్ధ శతకాలు చేశారు. అయితే, ఫాంలో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు రెండో టెస్టుకు దూరం కావడం టీమిండియాకు ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కావడంతో జట్టులో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. జడేజా, రాహుల్ గాయాలపాలవటంతో మూడో టెస్టు నుంచి విరాట్ టీమిండియాలోకి రావడం చాలా ముఖ్యంగా మారింది.

Whats_app_banner