IND vs ENG 1st Test: కుప్పకూలిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో అనూహ్య పరాజయం.. యంగ్ స్పిన్నర్ హార్ట్లీ విజృంభణ
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‍తో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన తర్వాత అనూహ్యంగా భారత్ ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలి నిరాశ మూటగట్టుకుంది.
India vs England 1st Test: స్వదేశంలో ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో భారత్‍కు షాక్ ఎదురైంది. తొలి టెస్టులో ఇంగ్లిష్ జట్టు చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 190 రన్స్ భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలి.. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్ అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్లీ (7/62) ఏడు వికెట్లతో సత్తాచాటి.. భారత బ్యాటింగ్ లైనప్‍ను కూల్చాడు. దీంతో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో నేడు (జనవరి 28) భారత్ 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు 231 పరుగుల లక్ష్యం ముందుండగా.. టీమిండియా 202 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39) రాణించగా.. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. కేఎస్ భరత్ (28), రవిచంద్రన్ అశ్విన్ (28) చివర్లో ఆశలు రేపినా గెలిపించలేకపోయారు. ఇంగ్లండ్ 24ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ తన తొలి మ్యాచ్‍లోనే సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లను పడగొట్టి.. టీమిండియాను కుప్పకూల్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, జో రూట్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు నేడు 6 వికెట్లకు 316 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించింది ఇంగ్లండ్. ఓలీ పోప్ (196) అదరగొట్టాడు. అయితే, ద్విశతకానికి నాలుగు పరుగుల దూరంలో ఔటయ్యాడు. మొత్తంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజా రెండు, అక్షర్ ఓ వికెట్ పడగొట్టారు. మొత్తంగా టీమిండియాకు 231 రన్స్ టార్గెట్ ఇచ్చింది ఇంగ్లండ్. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది భారత్. దీంతో ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి మ్యాచ్ ఓడి 0-1తో టీమిండియా వెనుకబడింది.
టపటపా పడిన టీమిండియా
231 పరుగుల లక్ష్యమే ఉండటంతో టీమిండియా గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే, భారత్ ఊహలకు అందని విధంగా కుప్పకూలింది. లక్ష్యఛేదనలో యశస్వి జైస్వాల్ (15) నిలకడగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ (39) ధాటిగా బ్యాటింగ్ మొదలుపెట్టాడు. అయితే, శుభ్‍మన్ గిల్ (0) డకౌట్ అయి మరోసారి నిరాశపరిచాడు. కాసేపటికే రోహిత్ కూడా ఔటయ్యాడు. ఈ మూడు వికెట్లను ఇంగ్లిష్ యువ స్పిన్నర్ టామ్ టార్ట్లీనే తీసుకున్నాడు.
అనంతరం కాసేపు నిలకడగా ఆడిన అక్షర్ పటేల్ (17), కేఎల్ రాహుల్ (22) కూడా పెవిలియన్ బాట పట్టారు. దీంతో 107 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. రవీంద్ర జడేజా (2), శ్రేయస్ అయ్యర్ (13) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయారు. జడేజా రనౌట్ అయ్యాడు.
భరత్, అశ్విన్ ఆశలు రేపినా..
టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్, సీనియర్ అశ్విన్ నిలకడగా ఆడి పరుగులు రాబడుతూ గెలుపు ఆశలను పెంచారు. 8వ వికెట్‍కు 57 పరుగులు జోడించారు. అయితే, వారిద్దరినీ వెనువెంటనే ఔట్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు హార్ట్లీ. చివర్లో సిరాజ్ (12)ను కూడా పెవిలియన్‍కు పంపాడు. దీంతో భారత్ ఆలౌటై.. పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 436 రన్స్ చేసిన భారత్ 190 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 420 పరుగులు చేయగలిగింది. 231 పరుగుల టార్గెట్ ముందుండగా రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటై టీమిండియా ఓటమి పాలైంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2న మొదలుకానుంది.