IPL 2024 New Captains: రుతురాజ్ నుంచి గిల్ వరకు.. ఐపీఎల్ 2024లో కొత్త కెప్టెన్ల హవా.. ఆ ఒక్కడు తప్ప..
IPL 2024 New Captains: ఐపీఎల్ 2024లో నాలుగు జట్టకు కొత్త కెప్టెన్లు వచ్చారు. మరి ఇప్పటికే సుమారు మూడు వారాలు పూర్తి కాగా.. ఆయా టీమ్స్ కొత్త కెప్టెన్ల సారథ్యంలో లీగ్ లో ఎలా రాణిస్తుందో ఒకసారి చూడండి.
IPL 2024 New Captains: ఐపీఎల్ 2024లో ఏకంగా నాలుగు జట్లు తమ కెప్టెన్లను మార్చి బరిలోకి దిగాయి. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు ధోనీ నుంచి రుతురాజ్ గైక్వాడ్ కు, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ కు, గుజరాత్ టైటన్స్ శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ బ్యాటన్లు అందించాయి. మరి లీగ్ తొలి మూడు వారాల్లో ఈ కొత్త కెప్టెన్లు ఎలా రాణించారన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది.
ఆ ఒక్కడు తప్ప..
నిజానికి నలుగురు కొత్త కెప్టెన్లలో ముగ్గురు ఫర్వాలేదనిపించినా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానే అతిపెద్ద సవాలు ఎదుర్కొంటున్నాడు. ఆ టీమ్ అభిమానుల నుంచి కూడా ఎదురవుతున్న హేళనలతో అతడు సతమతమవుతున్నాడు. నాలుగు మ్యాచ్ ల తర్వాతగానీ ఆ టీమ్ బోణీ చేయలేపోయింది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై టీమ్ రోహిత్ ఉండగానే హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగించడం చాలా మందికి నచ్చలేదు.
పైగా జట్టులో విభేదాలు అన్న వార్తలు. ఈ నేపథ్యంలో అందరి కన్నా హార్దిక్ కఠినమైన సవాలు ఎదుర్కొంటున్నాడు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఓడినా పెద్దగా పోయేదేమీ లేదన్న భావన పాండ్యాను స్వేచ్ఛగా నడిపించగా.. ముంబై విషయంలో అది రివర్సైంది. ఇప్పటికీ పాయింట్ల టేబుల్లో 8వ స్థానంలో ఉన్న ముంబై ప్లేఆఫ్స్ చేరడం కాస్త కష్టమైన విషయమే. మరి దీనిని హార్దిక్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
రుతురాజ్.. మంచి స్టార్ట్
చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్ పగ్గాలు చేపట్టడం అంటేనే పెద్ద సవాలు. అందులోనూ ఆ జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా చేసిన ధోనీ కూడా జట్టులో ఉన్నాడు. ఈ సవాలును యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సమర్థవంతంగానే స్వీకరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో సీఎస్కే 5 మ్యాచ్ లలో 3 గెలిచి, రెండు ఓడింది. పాయింట్ల టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది.
వికెట్ల వెనుక నుంచి ధోనీ అందిస్తున్న సహకారంతో రుతురాజ్ మెల్లగా నిలదొక్కుకుంటున్నాడు. మొదట్లో ప్లేయర్స్ కాస్త గందరగోళానికి గురైనా.. ఇప్పుడు రుతురాజే పట్టు సాధిస్తున్నాడు. సొంత మైదానంలో సీఎస్కే తిరుగులేని రికార్డు రుతురాజ్ కెప్టెన్సీలోనూ కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఆ టీమ్ తోనే ఉన్న రుతురాజ్.. ధోనీని దగ్గర నుంచి చూడటంతో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అతనికి బాగా తెలిసి వచ్చింది. ఇప్పుడతని కెప్టెన్సీలో సీఎస్కే టైటిల్ నిలబెట్టుకోలేకపోయినా.. ప్లేఆఫ్స్ చేరడం కూడా గొప్ప ఘనతే అని చెప్పొచ్చు.
కమిన్స్.. గాడిలో పెడుతున్నాడు
వార్నర్, విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ వెళ్లిపోయిన తర్వాత గతి తప్పిన సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఇప్పుడు ప్యాట్ కమిన్స్ గాడిలో పెడుతున్నాడు. కొత్త సీజన్లో కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగిన సన్ రైజర్స్ టీమ్.. ఐదు మ్యాచ్ లలో 3 గెలిచి, రెండు ఓడింది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఆ టీమ్ ఉంది. తన కెప్టెన్సీలో గతేడాది ఆస్ట్రేలియాను విశ్వ విజేతగా చేసిన కమిన్స్ పై భారీ అంచనాలే ఉండగా.. అతడు వాటిని మెల్లగా అందుకునే పనిలో ఉన్నాడు.
క్లాసెన్, ట్రావిస్ హెడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి సీనియర్ ప్లేయర్స్ నుంచి కమిన్స్ కు మంచి సహకారం కూడా అందుతోంది. ఇప్పటికే హైదరాబాద్ టీమ్ రెండుసార్లు ఆస్ట్రేలియా కెప్టెన్ల సారథ్యంలోనే ఐపీఎల్ గెలవగా.. ఇప్పుడు కమిన్స్ అదే రిపీట్ చేస్తాడన్న ఆశతో అభిమానులు ఉన్నారు.
శుభ్‌మన్ గిల్.. ఆత్మవిశ్వాసంతో..
ఈ సీజన్లో అందరి కంటే ఎక్కువ నష్టపోయింది గుజరాత్ టైటన్స్ టీమే. రెండు సీజన్లలో కెప్టెన్ గా ఉన్న హార్దిక్ తన పాత జట్టుకు వెళ్లిపోవడం, స్టార్ బౌలర్ షమి లేకపోవడంతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు కఠినమైన సవాలే ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ సవాలును గిల్ ఆత్మవిశ్వాసంతో అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టీమ్ ఐదు మ్యాచ్ లలో కేవలం రెండే గెలిచినా.. కెప్టెన్ గా గిల్ ప్రదర్శనకు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.
తొలి మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ ను చిత్తు చేయడం అతని కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఇక కోచ్ నెహ్రా సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అతనికి అందుతూనే ఉన్నాయి. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ అద్భుతాలు చేస్తుందన్న ఆశలు లేకపోయినా.. కెప్టెన్ గా గిల్ కాస్త నిలదొక్కుకుంటే.. వచ్చే సీజన్ నుంచి అయినా ఆ టీమ్ మళ్లీ గాడిలో పడగలదు.