Hardik Pandya prayers: సోమ్‌నాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
Hardik Pandya prayers: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.
Hardik Pandya prayers: ఈమధ్యే హార్దిక్ పాండ్యా ఏం చేసినా కలిసి రావడం లేన్నట్లుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హ్యాట్రిక్ ఓటములు ఎదురు కాగా.. ఇప్పటికే ఫ్యాన్స్ అతనితో ఆడుకుంటున్నారు. ఇక ఇప్పుడు సోమనాథ్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసినా కూడా అభిమానులు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అంతా డ్రామా అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
హార్దిక్ పాండ్యా ప్రత్యేక పూజలు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా శుక్రవారం (ఏప్రిల్ 5) గుజరాత్ లోని సోమనాథ్ ఆలయానికి వెళ్లాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తర్వాత తర్వాతి మ్యాచ్ కు ఆరు రోజుల గ్యాప్ రావడంతో మొదట ముంబై టీమంతా జామ్ నగర్ వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత హార్దిక్ మాత్రం సోమనాథ్ వెళ్లి మహా శివుడి దర్శనం చేసుకున్నాడు.
శివయ్యకు అభిషేకం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి నుంచి నెటిజన్లు హార్దిక్ తో ఆడుకుంటున్నారు. ఏదీ కలిసి రానప్పుడు ఇలా దేవుడి దగ్గరకు వెళ్తారు అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక పెళ్లికి ముందే పిల్లాడిని కని, ఓ క్రిస్టియన్ ను పెళ్లి చేసుకొని, సీనియర్ ప్లేయర్స్ ను ఫీల్డ్ అవమానించే నువ్వు ఇలా పూజలు చేయడమేంటని మరో అభిమాని ఘాటుగా స్పందించాడు.
నువ్వు చేసిన కర్మకు దేవుడు ఇప్పుడిలా చేస్తున్నాడని, దీని వల్ల ద్వేషం తొలగిపోతుందని భావిస్తున్నా అసలు ద్వేషం ఇప్పుడే మొదలవుతుందని కూడా అనడం గమనార్హం. ఇలా కెమెరాలను పెట్టి పూజలు చేయడం హార్దిక్ ను చూసే నేర్చుకోవాలని మరో అభిమాని మరింత ఘాటుగా ట్వీట్ చేశాడు.
ముంబై గాడిలో పడుతుందా?
ఏప్రిల్ 1వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో వాంఖెడేలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడింది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడింది. తర్వాత ఆ టీమ్ కు ఆఱు రోజుల బ్రేక్ దొరికింది. దీంతో క్రికెట్ ను పక్కన పెట్టి ఆ టీమ్ ప్లేయర్స్ రిలాక్స్ అయ్యారు. ఆదివారం (ఏప్రిల్ 7) ఆ టీమ్ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో నాలుగో మ్యాచ్ ఆడనుంది.
వరుస ఓటముల ఒత్తిడి, తీవ్ర విమర్శల మధ్య హార్దిక్ జట్టును ఎలా నడుపుతాడో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరోవైపు అతనికి ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారని, మరో రెండు మ్యాచ్ లు ఓడితే అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించనున్నారన్న వార్తలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్ ముంబైకి, హార్దిక్ కి కీలకం కానుంది.
ఇప్పటి వరకూ పాయింట్ల ఖాతా తెరవని ముంబై ఇండియన్స్ పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది. ఇక హార్దిక్ బ్యాట్ తోనూ విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్ లలో అతడు 11, 24, 34 స్కోర్లు చేశాడు. అయితే ఢిల్లీతో మ్యాచ్ కు ముందు ముంబై జట్టుతో స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చేరడం ఆ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.