Ind vs SA 2nd Test: కలవర పెడుతున్న కేప్‌టౌన్ చెత్త రికార్డు.. టీమిండియా తుది జట్టులో మార్పులు
Ind vs SA 2nd Test: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియాను కేప్‌టౌన్ లో గత రికార్డులు కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టుకు తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.
Ind vs SA 2nd Test: టీమిండియాకు మరుపురాని ఏడాదిగా మిగిలిపోయే 2023ను సౌతాఫ్రికా చేతుల్లో ఓటమితో ముగించింది. ఇక కొత్త ఏడాదిలో తొలి టెస్టును కూడా అదే జట్టుతో ఆడబోతోంది. బుధవారం (జనవరి 3) నుంచి కేప్‌టౌన్ లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇక్కడ టీమిండియా రికార్డు దారుణంగా ఉంది. అటు ఈ కీలకమైన టెస్టుకు తుది జట్టులో మార్పులు చేయనున్నారు.
సౌతాఫ్రికా గడ్డపై ఎప్పుడూ టెస్టు సిరీస్ గెలవని టీమిండియా.. ఇప్పుడు కనీసం డ్రా చేసుకోవాలన్నా రెండో టెస్టు గెలవాల్సిందే. అయితే మ్యాచ్ కు ముందు అలా గెలవడానికి సానుకూల అంశాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ 8 సార్లు ఆ దేశంలో పర్యటించిన ఇండియన్ టీమ్ ఏడు సిరీస్ లు కోల్పోయింది. 2010-11లో మాత్రం ధోనీ కెప్టెన్సీలో 1-1తో సిరీస్ డ్రా చేసుకోగలిగింది.
కేప్‌టౌన్‌లో అన్నీ ఓటములే..
రెండో టెస్ట్ జరగబోయే కేప్‌టౌన్ లో ఇప్పటి వరకూ ఇండియన్ టీమ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడి న్యూలాండ్స్ స్టేడియంలో ఇండియా మూడింట్లో ఓడిపోగా.. రెండు డ్రా చేసుకుంది. 1992లో ఇక్కడ తొలిసారి టెస్ట్ ఆడిన ఇండియన్ టీమ్ ఆ మ్యాచ్ ను డ్రా చేసుకోగలిగింది. ఇక 1997లో ఏకంగా 282 పరుగుల తేడాతో ఓడిపోయింది. పదేళ్ల తర్వాత 2007లో మరోసారి ఇక్కడ టెస్ట్ ఆడగా.. 5 వికెట్లతో ఓటమి తప్పలేదు.
2011లో మరోసారి కేప్‌టౌన్ లో టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేసుకుంది. 2018లో 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరిసారి 2022లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇక్కడి టెస్టును 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోహ్లి, బుమ్రాలాంటి వాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఆ సిరీస్ ఓటమి తర్వాతే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
తుది జట్టులో మార్పులు
ఈ రెండో టెస్టు కోసం టీమిండియా తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈసారి టాప్ ఫామ్ లో సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టి సిరీస్ గెలవడం ఖాయమన్న అంచనాల మధ్య బరిలోకి దిగినా.. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగులతో ఘోర పరాభవం తప్పలేదు.
దీంతో తుది జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో జడేజాను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి మ్యాచ్ లో విఫలమైన పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ లను మాత్రం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జడేజా, శార్దూల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ