IND vs SA 2nd Test: టీమిండియాకు మళ్లీ పేస్ పరీక్ష.. పిచ్ ఎలా ఉంటుందంటే.. భారత జట్టులో ఈ రెండు మార్పులు!-ind vs sa 2nd test pitch report india to face another pace test against south africa in cape town ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 2nd Test: టీమిండియాకు మళ్లీ పేస్ పరీక్ష.. పిచ్ ఎలా ఉంటుందంటే.. భారత జట్టులో ఈ రెండు మార్పులు!

IND vs SA 2nd Test: టీమిండియాకు మళ్లీ పేస్ పరీక్ష.. పిచ్ ఎలా ఉంటుందంటే.. భారత జట్టులో ఈ రెండు మార్పులు!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jan 01, 2024 08:29 PM IST

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండో టెస్టు కేప్‍టౌన్‍లో జరగనుంది. ఈ మ్యాచ్‍లోనూ భారత జట్టుకు పేస్ పరీక్ష తప్పేలా కనిపించడం లేదు. ఈ టెస్టుకు పిచ్ ఎలా ఉండనుందంటే..

కేప్‍టౌన్‍ న్యూలాండ్స్ మైదానం పిచ్
కేప్‍టౌన్‍ న్యూలాండ్స్ మైదానం పిచ్ (PTI)

IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికా గడ్డపై చివరి పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. రెండు టెస్టుల సిరీస్‍లో తొలి మ్యాచ్‍లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన భారత్.. రెండో టెస్టులో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‍ను సమం చేయాలనే కసితో ఉంది. అయితే, భారత్‍కు మరోసారి కఠినమైన పేస్ పరీక్ష ఎదురుకానుంది. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు కేప్‍టౌన్‍లోని న్యూలాండ్స్ మైదానంలో బుధవారం (జనవరి 2) నుంచి జరగనుంది.

పిచ్ ఎలా ఉండనుందంటే..

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరిగే న్యూలాండ్స్ గ్రౌండ్ పిచ్ పేస్‍కు ఎక్కువగా సహకరిస్తుంది. పిచ్‍పై పచ్చిక ఉండనుంది. దీంతో ఇది స్వింగ్, బౌన్స్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంది. మ్యాచ్ తొలి మూడు రోజులు పేస్ బౌలింగ్‍కు ఈ పిచ్ ఎక్కువగా సహకరిస్తుంది. చివరి రెండు రోజులు పేస్‍తో పాటు స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి మద్దతు దొరుకుతుంది.

సెంచూరియన్‍లో జరిగిన తొలి టెస్టులో కగిసో రబాడ, నాడ్రే బర్గర్ సహా దక్షిణాఫ్రికా పేసర్ల బౌలింగ్‍లో భారత బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. ఏకంగా ఇన్నింగ్స్ పరాజయం ఎదురైంది. ఇక, రెండో టెస్టు జరిగే కేప్ టౌన్ పిచ్ కూడా పేసర్ బౌలర్లకు సహరించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీంతో సఫారీ పేసర్లను అడ్డుకుంటేనే టీమిండియాకు గెలుపు దక్కే అవకాశాలు ఉంటాయి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా కీలకంగా మారనున్నారు. కేఎల్ రాహుల్ మంచి ఫామ్‍లో ఉండడం కలిసి వచ్చే అంశంగా ఉంది. గిల్ సత్తాచాటాల్సి ఉంది. 

రెండు మార్పులు

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం తుది జట్టులో టీమిండియా రెండు మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా కోలుకోవటంతో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో అతడు తుది జట్టులోకి రానున్నాడు. పిచ్‍కు పేస్‍కు సహకరిస్తుండటంతో ఇద్దరు స్పిన్నర్లతో ఆడే పరిస్థితి లేదు. దీంతో జడేజా వైపునకే టీమిండియా మేనేజ్‍మెంట్ మొగ్గు చూపనుంది. రెండో టెస్టులో పేసర్ ముకేశ్ కుమార్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. అయితే, ఇందుకోసం ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌ల్లో ఒకరిని మేనేజ్‍మెంట్ తప్పించే అవకాశం ఉంది. ఈ సిరీస్‍లో చివరిదైన రెండో టెస్టు గెలిస్తేనే భారత్ 1-1తో సమం చేసుకుంటుంది. డ్రా అయినా సిరీస్ చేజారుతుంది.

రెండో టెస్టులో భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్‍ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ/శార్దూల్ ఠాకూర్

Whats_app_banner