Minister Ambati : ఎన్నికల వరకు హలో ఏపీ.. తర్వాత ఛలో హైదరాబాద్‌ - పవన్ పై అంబటి ఫైర్-minister ambati rambabu fires on pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Ambati : ఎన్నికల వరకు హలో ఏపీ.. తర్వాత ఛలో హైదరాబాద్‌ - పవన్ పై అంబటి ఫైర్

Minister Ambati : ఎన్నికల వరకు హలో ఏపీ.. తర్వాత ఛలో హైదరాబాద్‌ - పవన్ పై అంబటి ఫైర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 29, 2023 06:34 PM IST

Minister Ambati Fires On Pawan:పవన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి అంబటి. వారాహి పేరు పెట్టుకుని బూతు పంచాంగమా..? ప్రశ్నించారు. ఎన్నికల దాకా హలో ఏపీ.. ఎన్నికలు అయ్యాక ఛలో హైదరాబాద్... ఇదీ బాబు-పవన్ ల తీరు అంటూ ధ్వజమెత్తారు.

మంత్రి అంబటి
మంత్రి అంబటి (facebook)

Minister Ambati Rambabu On Pawan: పవన్‌ ఎక్కాక వారాహి కాస్తా వరాహి అయ్యిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన... జనసేన అధినేత పవన్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్‌ కళ్యాణ్‌ గత కొద్ది రోజుల నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తూ...తన రాజకీయ ఉపన్యాసాల్లో నోటికొచ్చినట్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. "ఎప్పుడైతే పవన్‌ వారాహి అనే దేవత పేరు చెప్పుకుని ఆ వాహనం ఎక్కడో అప్పుడు అది వరాహి అయిపోయిందని చెప్పా. అంతే తప్ప అమ్మవారిని నేను దూషించడం, కించపరిచడం లేనే లేదు. పవన్‌ ఆ వాహనంపైకి ఎక్కి ఊగిపోతున్నాడు.. బూతులు తిడతాడు. కానీ ఆయన ఊగిపోతున్నాడు అని జగన్‌ గారు అంటే మాత్రం ఆయనకు చాలా కోపం వచ్చింది. పల్లెటూళ్లలో పూనకాలు వచ్చి ఊగిపోయి, చిందులేస్తుంటారు... ఇతను కూడా వారాహిపైకి ఎక్కి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు" అంటూ దుయ్యబట్టారు.

"అమ్మ ఒడి కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలా అంటూ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నాడు. వారాహి అనే మహాదేవత పేరు పెట్టుకుని ఇన్ని ఆబద్దాలు చెప్తున్న నిన్ను ఏమనాలి..? ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉంటుంది...ఆయన గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది. ఆయన రెండు చెప్పులు పోగొట్టుకోడానికి, చంద్రబాబుతో హైదారాబాద్‌ ఇంట్లో కలవడానికి, నోవాటెల్‌కు చంద్రబాబు రావడానికి ఒక కథ ఉంటుంది. మొత్తం కథలు కథలుగా ఉంటాయి ఆయన చెప్పేవన్నీ. సినిమాల్లో ఆయన కథానాయుడు... రాజకీయాల్లో కాకమ్మ కథలు చెప్పే కంత్రీ నాయకుడు అయ్యాడు. ఇలా కథలు చెప్పే దుస్థితికి నేడు పవన్‌ కళ్యాణ్‌ దిగజారిపోయాడు - అంబటి రాంబాబు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి

జగన్‌ గారు పోవాలనుకునే వాళ్లే.. రాష్ట్రం నుంచి పోవాలన్నారు మంత్రి అంబటి. ఎందుకు జగన్‌ పోవాలి..? ఎవరు రావాలి..? నువ్వు వస్తావా..? అంటే తెలియదు అంటావు అంటూ పవన్ ను టార్గెట్ చేశారు. జగన్‌ దిగిపోతే ఏమవుతుందో రాష్ట్ర ప్రజలకు తెలియదా.. ? ఒక అమ్మ ఒడి పోతుంది. ఒక విద్యా దీవెన పోతుంది.. ఒక రైతు భరోసా.. ఇలాంటి అనేకమైన పథకాలు పోతాయి. అందుకే జగన్ గారే కావాలి... అన్ని సంక్షేమ పథకాలూ ఉండాలనేదే ప్రజల కోరిక అని చెప్పుకొచ్చారు. "చంద్రబాబుకు, పవన్‌ కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లూ, వాకిలీ లేదు. ఎన్నికల వరకూ వీళ్లు హలో ఏపీ అంటారు..ఎన్నికల తర్వాత ఛలో హైదరాబాద్‌ అంటారు. వారు ఇక్కడకు వచ్చినప్పుడల్లా వారిది గెస్ట్‌ హౌస్‌ల్లో జీవితం... కానీ ఇక్కడే పోటీ చేస్తారు. హలో ఏపీ...అమ్మేశా జనసేన అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్న పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు అనర్హుడు. జ్వరం వచ్చిందని యాత్ర ఆపి, సినిమాలకు డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాడు. తన సినిమాకు తాను డబ్బింగ్‌ చెప్పుకుంటే తప్పేమీ లేదు కానీ... రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్‌ చెప్పే స్థాయికి ఎందుకయ్యా దిగజారిపోయావ్‌..?" అని ప్రశ్నించారు.

కన్నాకు 3 ప్రశ్నలు….

ఈ రాష్ట్రంలో మళ్లీ మళ్లీ జగన్‌ గారే వస్తారని స్పష్టం చేశారు అంబటి. " టీడీపీది బస్సు యాత్ర కాదు..తుస్సు యాత్ర అంటున్నారు. వారి యాత్రకు తెలుగుదేశం కార్యకర్తలు కూడా రావడంలేదు. దీనికే కన్నా లక్ష్మీనారాయణ సెల్ఫీ చాలెంజ్‌ చేస్తున్నాడు. నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని ఛాలెంజ్‌ చేస్తున్నావా..? ఎక్కడున్నావో తెలియదు...ఎక్కడ ఉంటావో తెలియదు...అసలు ఉంటావో లేదో తెలియదు. అలాంటి నీకు నాపై ఛాలెంజ్‌ చేసే అర్హత లేదు. నేను మూడు ఛాలెంజ్‌లు చేస్తున్నా..వాటిని స్వీకరించమని అడుగుతున్నా. వంగవీటి మోహన రంగా గారిని హతమార్చింది ఎవరో చెప్పు..? నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరో చెప్పు..? అన్నా కన్నా...చివరి వరకూ చంద్రబాబుతోనే ఉంటావా..? పార్టీ ఫిరాయిస్తావా..? చెప్పు. అసలు ఎన్నికల వరకూ సత్తెనపల్లిలోనే ఉంటావా..? పోటీ చేయకుండా పారిపోతావా అనేది సమాధానం చెప్పు. ఆ తర్వాతే మాట్లాడితే మంచిది" అంటూ కన్నాపై ఫైర్ అయ్యారు.

Whats_app_banner