Amit Shah: ‘300 కన్నా ఎక్కువే సీట్లు గెలుస్తాం; మళ్లీ ప్రధాని మోదీనే’: అమిత్ షా
Amit Shah: 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి 300 కు మించి సీట్లను గెల్చుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 300 సీట్లను గెలిపించి, మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని షా వ్యాఖ్యానించారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా శుక్రవారం జమ్మూలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, పట్నాలో జరుగుతున్న విపక్ష నేతల సమావేశంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
అది ఫోటో సెషన్
పట్నాలో జరుగుతున్న విపక్ష నేతల సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్ మాత్రమేనని, దానితో ఒరిగేదేమీ ఉండదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఒకవేళ, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వచ్చినా.. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ కచ్చితంగా 300 కు పైగా సీట్లను గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ‘పట్నాలో ప్రతిపక్ష నాయకుల ఫొటో సెషన్ జరుగుతోంది చూడండి. వారెన్ని ప్రయత్నాలు చేసినా.. వారిలో ఐక్యత సాధ్యం కాదు. ఒకవేళ వారంతా కలిసి పోటీ చేసినా.. మోదీజీ 300 పైగానే సీట్లను గెలిపిస్తారు. మళ్లీ ప్రధాని అవుతారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. శుక్రవారం పట్నాలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటిగా పోటీ చేయాలన్న లక్ష్యంతో దాదాపు 18 విపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యాయి. ఈ విషయాన్నే అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు.
మోదీకి కనివినీ ఎరుగని ఘన స్వాగతం
అమిత్ షా తన ప్రసంగంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనను కూడా ప్రస్తావించారు. మోదీకి యూఎస్ లో కనివినీ ఎరుగని ఘన స్వాగతం లభించిందన్నారు. అలాంటి, అధికారిక స్వాగతం, మోదీ గౌరవార్ధం ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్ గతంలో ఎన్నడూ, ఏ భారతీయ నాయకుడికి జరగలేదని, భవిష్యత్తులో జరగబోదని అమిత్ షా వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రతిష్టను మోదీ అంతర్జాతీయంగా ఆ స్థాయికి తీసుకువెళ్లారని షా ప్రశంసించారు. మోదీ పర్యటన సందర్భంగా అమెరికాతో స్పేస్, టెక్నాలజీ, డిఫెన్స్.. తదితర రంగాల్లో గొప్ప ఒప్పందాలు కుదిరాయని గుర్తు చేశారు.