Quit NDA : బీజేపీ దోస్తీకి పవన్‌ కళ్యాణ్‌ గుడ్‌బై చెప్పాలన్న సిపిఐ రామకృష్ణ-cpi state secretary ramakrishna demands janasena to quit bjp and nda ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Quit Nda : బీజేపీ దోస్తీకి పవన్‌ కళ్యాణ్‌ గుడ్‌బై చెప్పాలన్న సిపిఐ రామకృష్ణ

Quit NDA : బీజేపీ దోస్తీకి పవన్‌ కళ్యాణ్‌ గుడ్‌బై చెప్పాలన్న సిపిఐ రామకృష్ణ

HT Telugu Desk HT Telugu
Oct 28, 2022 07:56 AM IST

Quit NDA తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏపీలో జనసేన పార్టీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలుకు ప్రయత్నించిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీతో స్నేహానికి గుడ్‌ బై చెప్పాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Quit NDA టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్‌ కూడా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపికి సిగ్గుండాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నుండి బయటకు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే కమ్యూనిస్టుల్న వదిలేసి బీజేపీతో దోస్తీ ప్రారంభించాడు.

తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి వందల కోట్ల రూపాయల ఆఫర్ చేయటం సిగ్గుచేటని, రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎన్డీఏ నుండి బయటకు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనేందుకు బిజెపి వందల కోట్ల రూపాయల ఆఫర్ చేసి పోలీసులకు దొరికిపోయిందని రామకృష్ణ విమర్శించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక మొత్తం రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ పై జరుగుతోందని, గతంలో పలు రాష్ట్రాల్లో బిజెపి మెజార్టీ లేకపోయినా ప్రత్యర్థి పార్టీల ప్రజా ప్రతినిధులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయటం, డబ్బుతో కొనుగోలు చేయటం వంటి అనైతిక పనులు చేసిన బిజెపి అధికార పీఠాలు అడ్డదారుల్లో దక్కించుకుందని విమర్శించారు.

తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని, బిజెపి వద్ద లక్షల కోట్ల రూపాయల అక్రమ ధనం ఉన్నందున, విచ్చలవిడిగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ఒక్కో ఎమ్మెల్యేకు వందల కోట్లు వెచ్చిస్తోందని ఆరోపించారు. బిజెపికి చెందిన కేంద్రంలోని పెద్దాయన కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తోందని, బిజెపి మతవాద, కుయుక్త, బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు రామకృష్ణ.

బిజెపి అనైతిక వ్యవహారసైలిపై హైదరాబాదులోనే ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలి. రాజకీయాల్లో నైతిక విలువలు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎన్డీఏ నుండి బయటికి రావాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లలో జనసేనపై సిపిఐ నేరుగా మాట్లాడిన సందర్బంగా లేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధికి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ మూడు ప్రధాన పార్టీల మధ్యే ఉంది. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర నేపథ్యంలో సిపిఐ జనసేనను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Whats_app_banner