TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు- నాలుగు బృందాలు రంగంలోకి, 5గురు వైసీపీ నేతలు అరెస్టు-mangalagiri tdp office attack case police arrest five ysrcp activists arrested ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు- నాలుగు బృందాలు రంగంలోకి, 5గురు వైసీపీ నేతలు అరెస్టు

TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు- నాలుగు బృందాలు రంగంలోకి, 5గురు వైసీపీ నేతలు అరెస్టు

Bandaru Satyaprasad HT Telugu
Jul 03, 2024 02:11 PM IST

TDP Office Attack Case : మంగళగిరి టీడీపీ ఆఫీసు దాడి కేసు విచారణపై పోలీసులు దృష్టిసారించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఐదుగురిని అరెస్టు చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు

TDP Office Attack Case : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పై దాడి కేసు విచారణ స్పీడందుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విచారణ స్పీడు పెంచిన పోలీసులు... ఇటీవల టీడీపీ కార్యాలయంలో విచారణ జరిపారు. దాడి సమయంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ కేసులో తాజాగా పలువురిని అరెస్టు చేశారు. దాడికి వైసీపీ ఎమ్మెల్సీ కీలక సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడు మందిని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దాడికి సంబంధించి సుమారు 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. దాడికి పాల్పడిన వారిలో తాడేపల్లి, గుంటూరు, గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, గుంటుపల్లికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారి కదలికపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నాలుగు బృందాలు విచారణ

వైసీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్ 19న వైసీపీ మద్దతుదారులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఆఫీసులోని సిబ్బందిని గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో బుధవారం ఐదుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో గుంటూరుకు చెందిన వెంకటర్ రెడ్డి, మస్తాన్ వలి, దేవానందం, రాంబాబు, మొహియుద్దీన్ ఉన్నారు. నిందితులను మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈ కేసుపై విచారణ చేసుకున్న పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితుల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మరికొందరు టీడీపీ నేతలతో రాయబారాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, విద్యార్థి విభాగం నేతలను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2021 అక్టోబర్ 19న

టీడీపీ నేత పట్టాభి సీతారామ్...అప్పటి సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు మంగళగిరి టీడీపీ కార్యాలయంపైకి మూకుమ్మడిగా దండెత్తారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ సహా వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని సిబ్బంది, నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో అప్పట్లో కేసులు పెట్టిన పోలీసులు.. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరికొంత మందిని అరెస్టు చేశారు. టీడీపీ ఆఫీసుతో పాటు టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా వైసీపీ మద్దతుదారులు దాడి చేశారు. పట్టాభి ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. టీడీపీ ఆఫీసుపై దాడి అనంతరం అక్కడకు వెళ్లిన పోలీసులపై లోకేశ్ అనుచరులు దాడి చేశారు. అప్పట్లో లోకేశ్ సహా మరికొందరిపై హత్యాయత్నం కేసులు పెట్టారు.

Whats_app_banner

సంబంధిత కథనం