TDP Office Attack Case : మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి, పోలీసుల విచారణ ముమ్మరం-త్వరలో అరెస్టులు!
TDP Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన రెండున్నరేళ్లు కాగా, తాజా టీడీపీ ఆఫీసుకు వచ్చిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
TDP Office Attack Case : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసు ఆవరణలోని కార్లు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురిపై టీడీపీ నేతలు అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నమోదు కేసులపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. టీడీపీ ఆఫీసుకు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దాడి చేసిన వారితో పాటు ఈ దాడి వెనుక ఎవరున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
త్వరలో అరెస్టులు
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీలు విచారణ స్పీడందుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో... లెక్కలు మారుతున్నాయి. గతంలో జరిగిన దాడులపై నమోదైన కేసులు బయటకు తీస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం జరిగి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇవాళ టీడీపీ కార్యాలయానికి వచ్చిన పోలీసులు...దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కొంత సీసీ ఫుటేజీని తమతో తీసుకెళ్లారు పోలీసు అధికారులు. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ దాడిలో కీలకంగా వ్యవహరించిన వారిని పోలీసులు గురించారు. ముందుగా దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అనంతరం దాడి చేయించిన వారిపై పోలీసులు దృష్టిపెట్టనున్నారు.
2021 అక్టోబర్ 19న
టీడీపీ నేత పట్టాభి సీతారామ్...అప్పటి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు మంగళగిరి టీడీపీ ఆఫీసుపైకి దండెత్తారు. ఈ ఘటనలో 2021 అక్టోబర్ 19న టీడీపీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ సహా వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని సిబ్బంది, నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అప్పట్లో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీసుతో పాటు టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా వైసీపీ మద్దతుదారులు దాడి చేశారు. పట్టాభి ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. టీడీపీ ఆఫీసుపై దాడి అనంతరం అక్కడకు వెళ్లిన పోలీసులపై లోకేశ్ అనుచరులు దాడి చేశారు. అప్పట్లో లోకేశ్ సహా మరికొందరిపై హత్యాయత్నం కేసులు పెట్టారు.
సంబంధిత కథనం