పుంగనూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ..! ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్-ycp mp mithun reddy house arrest in tirupati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పుంగనూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ..! ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

పుంగనూరులో టీడీపీ వర్సెస్ వైసీపీ..! ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 30, 2024 11:04 AM IST

High Tension in Tirupati : పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తలపెట్టిన సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇవాళ ఉదయమే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

High Tension in Tirupati : ఏపీలో ఎన్నికలు పూర్తి అయినప్పటికీ పుంగనూరులో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైట్ నడుస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి టార్గెట్ గా టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన పలువురు నేతలను టీడీపీలోకి చేర్చుకుంటూ…. పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చేలా పావులు కదుపుతున్నారు.

ఇటీవలే పుంగనూరులోని వైసీపీ కౌన్సిలర్లు  షాకిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతో సహా మిగతా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వేరే కాకుండా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోని పరిస్థితిని చక్కదిద్దాలని భావించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… ఇవాళ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్దమవుతున్నారన్న సమాచారంతో నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో  వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని  పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఇంటిని చుట్టిముట్టారు.  ఈ పర్యటనకు వెళ్తే పుంగనూరులో గొడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో  మిధున్‌ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

 మిథున్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్ అయిన నేపధ్యంలో వందలాది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిన్న గొడవ జరిగినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు మిథున్‌ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు.

నియోజకవర్గానికి వెళ్లే హక్కు లేదా - ఎంపీ మిథున్ రెడ్డి

పోలీసుల తీరుపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాపై కక్షగట్టి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఎంపీగా సొంత నియోజకవర్గంలో తిరిగే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు ఓటేస్తేనే ఎంపీగా గెలిచానని…. అలాంటి వారిని పరామర్శించేందుకు వెళ్లొద్దటే ఎలా అని నిలదీశారు. గొడవలు చేయటానికి తాను పుంగనూరు వెళ్లటం లేదని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా… కార్యకర్తల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. చివరి వరకు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. తనను చంపినా పర్వాలేదు, తాము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని ఎంపీ మిథన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

 

WhatsApp channel