Ysrcp Mla Pinnelli EVM Damage : పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి- సీసీ కెమెరాల్లో రికార్డ్
Ysrcp Mla Pinnelli EVM Damage : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయిగేట్ 202 పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు.
Ysrcp Mla Pinnelli EVM Damage : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...పోలింగ్ రోజు ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేట్ 202 పోలింగ్ బూత్ లోకి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా ఈవీఎం వద్దకు వెళ్లి...మిషన్ ను నేలకేసికొట్టారు. అనంతరం వీవీ ప్యాట్ మిషన్ కూడా ధ్వంసం చేశారు. అక్కడున్న ఏజెంట్ ఎమ్మెల్యేను నిలువరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి అతడిని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు పోలింగ్ బూత్ లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీ కెమెరాలో దృశ్యాలు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అజ్ఞాతంలోకి పిన్నెల్లి
పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్ల హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ రోజు సాయంత్రం ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాచర్ల అల్లర్లపై సిట్ విచారణ ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్ లో ఉన్నానని ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
టీడీపీ విమర్శలు
ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ఘటనపై టీడీపీ స్పందిస్తూ...ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణహోమం చేసి, ఏం తెలియనట్టు జగన్ దేశం దాటి పోతే, ఎమ్మెల్యేలు రాష్ట్రం దాటి పారిపోయారని మండిపడింది. ప్రజలు తమకు ఓట్లు వేయటం లేదని, జగన్ చేయని పాపం లేదని ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తరువాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని టీడీపీ హెచ్చరించింది. పోలింగ్ రోజునే ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యేల దారుణాలకు పాల్పడ్డారని విమర్శించింది.
పిన్నెల్లిపై జూలకంటి ఫైర్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హింసను ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే ఈసీని అప్రమత్తం చేశామన్నారు. అయితే ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉందన్నారు. పోలింగ్ తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే హెచ్చరించారన్నారు. పిన్నెల్లి వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మాచర్ల ఘర్షణల అనంతరం పిన్నెల్లిని పోలీసులు గృహనిర్బంధం చేశారని, అయితే ఆయన తప్పించుకుని హైదరాబాద్ పారిపోయారన్నారు. అక్కడ పిన్నెల్లి మీడియాతో మాట్లాడరని, అయినా చర్యలు తీసుకోలేదన్నారు. పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే హైదరాబాద్ ఎందుకు పారిపోయారని జూలకంటి ప్రశ్నించారు. పిన్నెల్లి ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయని నిలదీశారు. పిన్నెల్లి తన అనుచరులను రెచ్చగొట్టి హింసకు పాల్పడ్డారని ఆరోపించారు.
సంబంధిత కథనం