Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
AP Elections 2024 Updates: ఏపీలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు.పల్నాడు జిల్లా ఎస్పీ,కలెక్టర్ పై ఈసీ వేటు వేసింది.
AP Elections 2024 Updates: రాష్ట్రంలో పలువురు అధికారుల బదిలీ అయ్యారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ను ఈసీ బదిలీ చేసింది. ఇదే సమయంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేయగా…శాఖపరమైన విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది.
పల్నాడు,అనంతపురం, తిరుపతి జిల్లాల పరిధిలోని మరో 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించింది. మరో 25 సీఆర్పీఎఫ్ కంపెనీ బలగాలను ఏపీలో మోహరించాలని ఈసీ నిర్ణయించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది.
ఫలితాల విడుదల వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ దిశానిర్దేశం చేసింది. హింసాత్మక ఘటనల్లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది.
మొత్తంగా చూస్తే 16 మంది అధికారులపై ఈసీ చర్యలుకు ఉపక్రమించింది. 14 మంది పోలీసు అధికారులు సస్పెన్షన్ కాగా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
సీఎస్ , డీజీపీతో సమావేశం
ఏపీ డీజీపీ,సీఎస్ తో గురువారం భేటీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఏపీలోని పరిస్థితులపై చర్చించారు. పలు అంశాలపై ఆరా తీశారు. హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలను ఇచ్చారు.
పోలింగ్ అనంతరం ఏపీలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలను సీఈసీ ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఈసీ అభిప్రాయపడింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఈసీ దిల్లీకి పిలిచింది.ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన సీఎస్, డీజీపీ….ఈసీ అధికారులతో సమావేశమయ్యారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఘర్షణలు తగ్గలేదు. పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో అల్లర్లు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. అయితే దాడులను నివారించడంపై పోలీసులు యంత్రాంగం విఫలమైందని టీడీపీ, వైసీపీ ఆరోపణలు చేస్తున్నాయి.
ఏపీలో పరిస్థితులపై ఈసీ సీరియస్ అయ్యింది. దాడులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఘటనలపై ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణలకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని సీఈవో హెచ్చరించారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.