EC Serious On CS DGP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్- సీఎస్, డీజీపీలకు నోటీసులు
EC Serious On CS DGP : ఏపీలో హింస చెలరేగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వెంటనే దిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
EC Serious On CS DGP : పోలింగ్ అనంతరం ఏపీలో హింస చెలరేగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలను సీఈసీ ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఈసీ అభిప్రాయపడింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఈసీ దిల్లీకి పిలిచింది. అలాగే ఎన్నికల అనంతరం హింసపై సీఎస్, డీజీపీ తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
పలు జిల్లాల్లో ఘర్షణలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఘర్షణలు తగ్గలేదు. పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో అల్లర్లు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. అయితే దాడులను నివారించడంపై పోలీసులు యంత్రాంగం విఫలమైందని టీడీపీ, వైసీపీ ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీలో పరిస్థితులపై ఈసీ సీరియస్ అయ్యింది. దాడులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఘటనలపై ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణలకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని సీఈవో హెచ్చరించారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించామన్నారు. పలు జిల్లాల్లో జరిగిన ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.
డీజీపీ వరుస సమీక్షలు
పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ తర్వాత పల్నాడు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో డీజీపీ వరుస సమీక్షలు చేపడుతున్నారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడులతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు తలెత్తిన జిల్లాల్లో పరిస్థితులు డీజీపీ ఆరా తీస్తున్నారు. అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరింపునకు డీజీపీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఘర్షణకు కారణమవుతున్న ప్రధాన నేతలను హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ ముఖ్యనేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. దాడులను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను రోజుకు రెండు, మూడు సమీక్షలను నిర్వహించి డీజీపీ తెలుసుకుంటున్నారు.
పాలన, పోలీసు వ్యవస్థపై ఈసీ పరిశీలకులు అసంతృప్తి
ఏపీలో సరైనా పాలనావ్యవస్థ లేదని ఎన్నికల పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు. అధికారులు, పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి నివేదిక అందించారు. పాలన, పోలీసు వ్యవస్థలపై ఈసీ పరిశీలకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదికలు ఇచ్చారు. పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా ఈసీకి నివేదిక ఇచ్చారు.
సంబంధిత కథనం