AP High Tension : రణరంగంలా మారిన ఏపీ, తిరుపతిలో విధ్వంసం- పల్నాడు, తాడిపత్రిలో రాళ్లదాడులు
AP High Tension : ఏపీ రణరంగంలా మారుతోంది. తిరుపతి, తాడిపత్రి, పల్నాడు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై పులివర్తి నానిపై దాడి జరిగింది.
AP High Tension : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసినా... రాజకీయ వేడి చల్లారలేదు. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్ల దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో ఈవీఎం స్ట్రాంగ్ రూంలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై రాళ్ల దాడి చేశారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. రాళ్ల దాడిలో పులివర్తి నానికి, ఆయన డ్రైవర్ గాయపడినట్లు తెలుస్తోంది. నాని సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కూడా కొందరు దాడికి పాల్పడ్డారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ లలోని ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పులివర్తి నాని అక్కడకు వచ్చాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ సమయంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు భారీగా ఉండటంతో వారు నానిపై దాడికి పాల్పడ్డారు.
పోలీసుల లాఠీఛార్జ్
పులివర్తి నానిపై దాడితో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు పద్మావతి మహిళా వర్సిటీ వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అయితే దాడికి పాల్పడిన వారిపై కాకుండా తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారని టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో... వారు నిరసనకు దిగారు. సీఐ రామచంద్రారెడ్డి తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు.
పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం
ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఓటమికి భయపడిన పిరికిపందలే దాడులకు పాల్పడుతున్నారన్నారు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ కార్యకర్తలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? అని ప్రశ్నించారు. నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని, పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారన్నారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో... ప్రజలకు, ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం అవుతున్నారన్నారు. మరోవైపు మాచర్లలో ఇప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తాడిపత్రిలోను దాడులు నిరాటంకంగా సాగుతున్నాయన్నారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు. చంద్రగిరి, తాడిపత్రి, నరసరావుపేట ఏ నియోజకవర్గంలో చూసినా వైకాపా దాడులే కనిపిస్తున్నారన్నారు.
తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రిలో కూడా ఉద్రికత్త నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో సీఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. నిన్ని టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడికి నిరసనగా ఇవాళ పోలీస్ స్టేషన్ వద్ద జేసీ ప్రభాకర్ నిరసనకు దిగారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైపు వెళ్తుండగా అక్కడికి వైసీపీ కార్యకర్తలు భారీగా చేసుకున్నారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేశుని పాడులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. కారంపూడిలో టీడీపీ ఆఫీస్ కు వైసీపీ మద్దతుదారులు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
సంబంధిత కథనం