AP Polling : ఏపీలో ముగిసిన పోలింగ్, పలు ప్రాంతాల్లో ఘర్షణలు, బాంబు దాడులు- రీపోలింగ్ కు నో ఛాన్స్ అన్న సీఈవో-ap ts polling completed ceo mukesh kumar meena says no repolling needed ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Polling : ఏపీలో ముగిసిన పోలింగ్, పలు ప్రాంతాల్లో ఘర్షణలు, బాంబు దాడులు- రీపోలింగ్ కు నో ఛాన్స్ అన్న సీఈవో

AP Polling : ఏపీలో ముగిసిన పోలింగ్, పలు ప్రాంతాల్లో ఘర్షణలు, బాంబు దాడులు- రీపోలింగ్ కు నో ఛాన్స్ అన్న సీఈవో

Bandaru Satyaprasad HT Telugu
May 13, 2024 09:42 PM IST

AP Polling : ఏపీ, తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 68 శాతం, తెలంగాణలో 61.66 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఏపీలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి. అయితే రీపోలింగ్ అవసరంలేదని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు.

ఏపీలో ముగిసిన పోలింగ్
ఏపీలో ముగిసిన పోలింగ్

AP Polling : తెలుగు రాష్ట్రాలో పోలింగ్ ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే 6 గంటలకు క్యూలైన్లలో నిలబడిన వారికి ఓటు వేసే హక్కు కల్పించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగిసింది. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిందని ఈసీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటలకు వరకు ఏపీ వ్యాప్తంగా 67.99 శాతం, తెలంగాణలో 61.66 శాతంగా పోలింగ్ నమోదైంది. అయితే తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించాల్సి ఉంది.

రీపోలింగ్ అవసరంలేదు

ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఆయన తెలిపారు. పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో దాడులు జరిగాయని, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని ఎంకే మీనా స్పష్టం చేశారు. ఈవీఎంల మొరాయింపు కారణంగా పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 275 బీయూలు, 217 సీయూలు, 600 వీవీప్యాట్‌లకు సంబంధించి సమస్యలు తలెత్తాయన్నారు. హింసాత్మక ఘటనలపై ముందస్తు సమాచారంతో అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో తగిన భద్రత ఏర్పాటు చేశామన్నారు. మాచర్ల కేంద్రంలో కొందరు ఈవీఎంలు పగలగొట్టారని, ఇంజినీర్లు యంత్రాలను పరిశీలించి డేటా రికవరీ చేయొచ్చని తెలిపారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని సీఈవో మీనా స్పష్టం చేశారు. రాత్రి 10 గంటలకు పోలింగ్‌ పూర్తయ్యే అవకాశముందన్నారు. ఈసారి పోలింగ్‌ శాతం బాగా పెరిగిందన్న ఆయన... సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్‌ నమోదైందని స్పష్టం చేశారు.

ఏపీలో ఘర్షణలు

ఏపీలో పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పల్నాడు, అనంతపురం, మాచర్ల ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు దాడి చేసుకున్నారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజక వర్గం బెస్తరపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో టీడీపీ అభ్యర్థికి చెందిన వాహనం ధ్వంసమైంది.

పల్నాడులో బాంబులతో దాడి

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తంగెడలో వైసీపీ, టీడీపీ శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో దాడులకు పాల్పడ్డారు. పోలింగ్‌ ముగిసే సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఓటింగ్‌ శాతం పెరిగితే తమకు నష్టమేమోనని వైసీపీ మూకలు నాటు బాంబులతో దాడులకు దిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకోవడంతో ఓటర్లు భయాందోళనకు గురై పోలింగ్‌ కేంద్రం నుంచి పరుగులు తీశారు. ఓటింగ్‌ శాతం తగ్గించేందుకే వైసీపీ ఇలాంటి దాడులకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో సుమారు 10 బైక్ లు, నాలుగు షాపులు మంటల్లో దగ్ధమయ్యాయి.

Whats_app_banner

సంబంధిత కథనం