AP TS Polling Percentage : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోలింగ్- ఏపీలో 81 శాతం, తెలంగాణలో 64.74 శాతం!
AP TS Polling Percentage : తెలుగు రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతాలు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. పలు చోట్ల నిన్న రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో పోలింగ్ 81 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉంటే, తెలంగాణలో 64.74 పోలింగ్ నమోదైంది.
AP Polling Percentage : తెలుగు రాష్ట్రాల్లో రికార్డు పోలింగ్ శాతాలు నమోదు అయ్యే అవకాశం ఉందని సమాచారం. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఏపీలో కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25 శాతం పోలింగ్ నమోదు కాగా...1.2శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అయితే పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. సుమారు 81 శాతం పోలింగ్ నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నామని సీఈవో మీనా తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.2శాతం పోలింగ్ నమోదు కాగా, 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.80 శాతం పోలింగ్ నమోదైందన్నారు. రాష్ట్రంలో నిన్న పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై సీఈవో మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో 86.87 శాతం పోలింగ్ రికార్డైంది. ఇందులో పురుషులు 1,03,604 మంది, మహిళలు 1,01,762 మంది, ఇతరులు ముగ్గురు ఓట్లు వేయగా... మొత్తం 2,36,409 ఓట్లకు 2,05,369 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.
అన్నాబత్తుని శివకుమార్ పై కేసు నమోదు
తెనాలి పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో అన్నాబత్తునితో పాటు మరో 7గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఓటరు చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. పోలింగ్ కేంద్రంలోకి తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. అతడు ఎమ్మెల్యే తీరును ప్రశ్నించడంతో ఆగ్రహించిన శివకుమార్ ఓటరును చెంప దెబ్బ కొట్టారు. దీంతో సదరు వ్యక్తి కూడా ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
మంత్రి బుగ్గనపై కేసు
డోన్ వైసీపీపై అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం ఎన్నికల పోలింగ్ సమయంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడి చేశారు. తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో తన కారు అద్దాలను ధ్వంసం చేశారని పీఎన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి బుగ్గనతో పాటు నగర పంచాయతీ ఛైర్మన్ చలంరెడ్డి, మరో 32 మంది బుగ్గన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయగా, వారిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో 64.74 శాతం పోలింగ్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సోమవారం రాత్రి 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 64.74 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పూర్తి స్థాయి అధికారిక లెక్కలను ఈసీ ప్రకటించాల్సి ఉంది. మరో రెండు శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 62.07 శాతం పోలింగ్ నమోదు కాగా..ఈసారి భారీగా పెరిగింది.
సంబంధిత కథనం