Medak, Zahirabad: మెదక్, జహీరాబాద్ లో పెరిగిన ఓటింగ్‌తో లాభ పడేది ఎవరు? 2019కంటే పెరిగిన పోలింగ్…-who will benefit from increased voting in medak and zaheerabad increased polling than 2019 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Medak, Zahirabad: మెదక్, జహీరాబాద్ లో పెరిగిన ఓటింగ్‌తో లాభ పడేది ఎవరు? 2019కంటే పెరిగిన పోలింగ్…

Medak, Zahirabad: మెదక్, జహీరాబాద్ లో పెరిగిన ఓటింగ్‌తో లాభ పడేది ఎవరు? 2019కంటే పెరిగిన పోలింగ్…

HT Telugu Desk HT Telugu
May 14, 2024 09:54 AM IST

Medak, Zahirabad: గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే మెదక్, జహీరాబాద్ లోక్ సభ స్థానాల్లో ఈ సారి జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ పెరిగింది. దీంతో లాభపడేది ఎవరనే చర్చ జరుగుతోంది.

మెదక్‌, జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో భారీగా పెరిగిన పోలింగ్
మెదక్‌, జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో భారీగా పెరిగిన పోలింగ్ (PTI)

Medak, Zahirabad: మెదక్‌, జహీరాబాద్‌ నియోజక వర్గాల్లో పెరిగిన పోలింగ్ వల్ల ఎవరికీ లాభం కలుగుతుందో లెక్కలు వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు ఆయా పార్టీల నేతలు. జహీరాబాద్ నియోజకవర్గంలో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 69.70 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి పోలింగ్ శాతం 74.54 శాతానికి పెరిగింది.

జహీరాబాద్ లో గత లోక్ సభ ఎన్నికల్లో పోలిస్తే సుమారుగా 5 శాతం పోలింగ్ పెరిగింది. తుది లెక్కల తర్వాత, ఈ పోలింగ్ ఇంకా కొంత పెరిగే అవకాశమున్నదని అంటున్నారు అధికారులు. ఇదేవిధంగా, మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో గత 2019 లోక్ సభ ఎన్నికల్లో 71. 75 పోలింగ్ నమోదు కాగా, ఈ సారి అది 74.38 శాతానికి పెరిగింది .

ఎన్నికల కమిషన్ విడుదల చేయనున్న, తుది పోలింగ్ శాతంలో ఇది ఇంకా కొంత మేరకు పెరిగే అవకాశమున్నదని ఎన్నికల అధికారులు అంటున్నారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో కూడా గత ఎన్నికలో పోలిస్తే, ఈ ఎన్నికల్లో సుమారుగా 3 శాతం పోలింగ్ పెరిగింది.

పెరిగిన పోలింగ్ ఎవరికీ బలం అవుతుందంటే, మూడు ప్రధాన పార్టీలు కూడా మాకే లాభిస్తుందని వాదిస్తున్నాయి. సాధారణంగా, ఒక రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ శాతం పెరిగందంటే అది ప్రభుత్వం పైన వున్న వ్యతిరేకతను తెలుపుతుందని ఎన్నికల పండితులు అంటుంటారు.

ఇప్పుడు జరిగే ఎన్నికలు కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియచేస్తున్నదా అంటే కాదనే అంటున్నారు ఎన్నికల విశ్లేషకులు. ఎందుకంటే, రాష్టంలో జరిగిన అన్ని సర్వేల్లో కూడా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు రానన్నిసీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ పెరిగిన పోలింగ్ శాతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను తెలియచేస్తుందా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిండా ఐదు నెలలే అవుతోంది.

బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం, కేంద్రంలోని బీజేపీ పైన, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వలనే ఓటింగ్ పెరిగిందని.. అది తప్పకుండా తమ పార్టీ అభ్యర్థులకు లాభం చేకూరుస్తుందని అని వాదిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులూ మాత్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పైన వ్యతిరేకత వలెనే ఓటర్లు పోలింగ్ బూత్ లకు బారులు తీరారని.. పెరిగిన పోలింగ్ శాతం, తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు లాభిస్తుందని అని వాదిస్తున్నారు. బీజేపీ నాయకులూ మాత్రం, ప్రజలు ఎలాగైనా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని గెలిపించాలని ఉత్సాహంతోనే, ఈ సారి ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో తమ ఓటును హక్కును ఉపయోగించుకున్నారన్నారు.

జూన్ 4న తేలనున్న భవితవ్యం…

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నిలుపుకపోవటం వలన, కాంగ్రెస్ పైన తెలంగాణాలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీజేపీ నాయకులూ అంటున్నారు. అదేవిధంగా, గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన కూడా ఇంకా ప్రజల్లో వ్యతరేకత తగ్గలేదం కాషాయ పార్టీ నేతలు వాదిస్తున్నారు. పెరిగిన పోలింగ్ ఎవరికీ లబ్ది చేకూరుస్తుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చుడాలిసిందే.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner