AP Polling Percentage: ఏపీలో 80శాతం దాటనున్న పోలింగ్ శాతం... సాయంత్రానికి తేలనున్న లెక్కలు-the polling percentage in ap will exceed 80 percent the calculations will be released in the evening ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Polling Percentage: ఏపీలో 80శాతం దాటనున్న పోలింగ్ శాతం... సాయంత్రానికి తేలనున్న లెక్కలు

AP Polling Percentage: ఏపీలో 80శాతం దాటనున్న పోలింగ్ శాతం... సాయంత్రానికి తేలనున్న లెక్కలు

Sarath chandra.B HT Telugu
May 14, 2024 02:29 PM IST

AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌పై సాయంత్రానికి స్పష్టత వస్తుందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. సోమవారం అర్థరాత్రి 2గంటల వరకు రాష్ట్రంలో పోలింగ్ జరిగిందని తుది లెక్కలు వెలువడటానికి సమయం పడుతుందన్నారు.

ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ మీనా
ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ మీనా

AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్‌లో చాలా నియోజక వర్గాల్లో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికల మాదిరే ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. అర్థరాత్రి వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు.

రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 వరకూ పోలింగ్ జరిగిందని సీఈఓ మీనా తెలిపారు. -2019 ఎన్నికల్లో 79.25 శాతం పోలింగ్ నమోదైంది. మరో 0.5శాతం శాతం పోస్టల్ బ్యాలెట్తో కలిపి 79. 75 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ వివరించారు.

2024 ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనాలు ఉన్నాయని చెప్పారు. అప్పట్లో 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌లు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రానికి తుది గణంకాలు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 81 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.

ఏపీలో భారీగా పోలింగ్…

ఏపీలో గత కొన్నేళ్లుగా మొత్తం ఓట్లలో 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో భారీ పోలింగ్ నమోదైంది. 80శాతాన్ని దాటనుంది. మొత్తం ఓటర్లలో 80శాతం పోలింగ్‌ నమోదు కావడంపై ఎన్నికల సంఘం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ఓటర్ల జాబితాలో నూరు శాతం పక్కాగా ఉండకపోవచ్చని ఈసీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

మల్టీపుల్ ఎంట్రీలు, గతంలో ఉన్న ఇళ్లలో ప్రస్తుతం నివసించకపోవడం, వేర్వేరు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం, చనిపోయిన ఓట్లను తొలగించకపోవడం వంటి కారణాలతో దాదాపు 10శాతం తేడా ఉంటుందనే లెక్కలు ఉన్నాయి. ఒక మనిషి ఒక్క చోట మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించారు. దీంతో ఏపీ, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు ఏదో ఒక చోట మాత్రమే ఓటు వేయాల్సి వచ్చింది.

ఏపీలో దాదాపు 80శాతం పోలింగ్ నమోదు కావడంతో మొత్తం అసలైన ఓటర్లు 90శాతం మాత్రమే అనుకుంటే ఓటు వేయని వారు పదిశాతం మాత్రమే ఉంటారని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. 80శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం ఆరోగ్యకరమైన వాతావరణమేనని అభిప్రాయపడుతున్నారు

పెరుగుతున్న పోలింగ్ శాతం…

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి వచ్చింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీగానే పోలింగ్ నమోదైంది. 2014లో 78.41శాతం పోలింగ్ నమోదైతే, 2019లో 79.64శాతం పోలింగ్ నమోదైంది.

2014లో అలా…

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3,67,21,608మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,82,54,651మంది పురుషులు, 1,84,63,770మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు మరో 3187మంది ఉన్నారు.

2014 ఎన్నికల్లో ఏపీలోని మొత్తం ఓటర్లలో 1,43,78,804మంది పురుషులు, 1,44,12,652మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 157మంది ట్రాన్స్‌ జెండర్లు కూడాఓటు వేశారు. మొత్తం 2,87,91,613మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 3,67,21,608 ఓట్లలో 2,87,91,613 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 78.41శాతం పోలింగ్ నమోదైంది.

2019 ఎన్నికల నాటికి ఏపీలో 3,93,45,717 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,94,62,339 మంది, 1,98,79,421మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 3957మంది ఉన్నారు.

2019 ఎన్నికల్లో 1,55,45,211మంది పురుషులు, 1,57,878,759మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 661మంది ట్రాన్స్‌ జెండర్లు కూడా ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 3,13, 33,631మంది ఓటు హక్కును వినియోగించుకున్న పోలింగ్ శాతం 79.65శాతంగా నమోదైంది.

తాజా ఎన్నికల్లో...

2024 ఎన్నికల నాటికి ఏపీలో మొత్తం 4,09,37,532మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,00,84,276మంది, మహిళలు 2,08,49,730మంది ట్రాన్స్‌జెండర్లు 3,346మంది ఉన్నారు. పోలింగ్‌ ముగిసే నాటికి ప్రాథమిక అంచనాల్లో దాదాపు 78.65శాతం పోలింగ్‌ జరిగినట్టు గుర్తించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగడంతో తుది లెక్కలు ఖరారు కాలేదు. పోలింగ్ శాతం 2019 ఎన్నికల కంటే ఎక్కువ ఉంటుందా, తగ్గుతుందా అనే దానిపై స్పష్టత రాలేదు.

మహిళా ఓటర్లే కీలకం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో మహిళలు బారులు తీరడం కనిపించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్లు స్థిరపడ్డారు. వారిలో చాలామంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తరలి వచ్చారు.

మునుపెన్నడు లేని విధంగా హైదరాబాద్‌ నుంచి పోలింగ్ కోసమే వేల సంఖ్యలో వాహనాలు ఏపీలోని వివిధ జిల్లాలకు తరలి వచ్చాయి. ప్రధానంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఓటర్లు తరలి వచ్చారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఓటర్లలో ఏపీ స్థానికత కలిగిన ఓటర్లు దాదాపు 25-30లక్షల మంది ఉంటారనే అంచనాలు ఉన్నాయి. వీరిలో చాలామందికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. హైదరాబాద్‌ ఓటర్లపై అన్ని ప్రధాన పార్టీలు దృష్టి పెట్టడంతో పోలింగ్ ఉత్సాహంగా జరిగింది.

WhatsApp channel