Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి
Tadipatri Violence : ఏపీలో పోలింగ్ పూర్తైన తర్వాత హింస చెలరేగింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ మద్దతుదారులు వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేశారు. ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారు.
Tadipatri Violence : అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి అల్లర్లు చెలరేగాయి. పోలింగ్ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లదాడులు చేసుకుంటున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా టీడీపీ, వైసీపీ నాయకులను పోలీసులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని వేరే ప్రాంతానికి తరలించారు పోలీసులు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా
టీడీపీ మద్దతుదారుల వైసీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి చేరుకుని, ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ ఘర్షణలో సీఐ మురళీకృష్ణ సహా పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఎస్పీ వాహనం ధ్వంసమైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత
టీయర్ గ్యాస్ ప్రభావంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారు. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయోగించిన భాష్పవాయువు ప్రభావంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్యం పాలైయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చూసేందుకు ఎవరూ రావద్దంటూ ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కోరారు. అన్ని చికిత్సలు పూర్తి అయ్యాక హెల్త్ బులెటిన్ ప్రకటిస్తామని వైద్యుల తెలిపారు.
పల్నాడులో 144 సెక్షన్
పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో రెండు రోజుల పాటు దుకాణాలు మూసివేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడొద్దని పోలీసుల హెచ్చరించారు. పోలీసుల ఆదేశాలతో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు.
ఏపీలో హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్
పోలింగ్ తర్వాత ఏపీలో హింస చెలరేగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమ్మన్లు జారీ చేసింది. ఏపీలో కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు సీఈసీ ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఈసీ అభిప్రాయపడింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఈసీ దిల్లీకి పిలిచింది. అలాగే ఎన్నికల అనంతరం హింసపై సీఎస్, డీజీపీని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
సంబంధిత కథనం