AP Polling Tension : ఏపీ పోలింగ్ లో హైటెన్షన్- పలు చోట్ల పరస్పర దాడులు, ఈవీఎంలు ధ్వంసం
AP Polling Tension : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. అయితే పలు జిల్లాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.
AP Polling Tension : ఏపీలో పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నారు. పలు జిల్లా్ల్లో ఘర్షణ వాతావరణంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు ఏపీ వ్యాప్తంగా 40.26 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండడంతో ఓటర్ల భారీగా క్యూలైన్లలో వేచిచూస్తున్నారు.
మాచర్లలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులతో పోలింగ్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడుల్లో ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. దీంతో సిబ్బంది పోలింగ్ నిలిపివేశారు. మాచర్ల నియోజవర్గంలోని తుమ్మరకోటలో ఘర్షణ జరగడంతో పోలింగ్ నిలిచిపోయింది. రెంటాలలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనంపై దాడికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం ముస్తాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై దాడి జరిగింది. నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారుపై ఓ వర్గం వాళ్లు దాడికి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ వర్గీయులే దాడికి పాల్పడ్డారని మంత్రి అంబడి రాంబాబు ఆరోపించారు.
ఓటర్ పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడి
గుంటూరు జిల్లా తెనాలిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓటర్ పై వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేశారు. క్యూలైన్‍లో కాకుండా నేరుగా వైసీపీ అభ్యర్థి వెళ్లడంపై ఓటరు అభ్యంతరం తెలిపాడు. ఆగ్రహంతో ఓటరుపై దాడి చేశాడు. ఓటర్ పై ఎమ్మెల్యే అనుచరుల విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఎమ్మెల్యేతో గొడవపడిన గొట్టిముక్కల సుధాకర్ ను పోలీసులు స్టేషన్ తరలించారు. ఎమ్మెల్యే దాడిలో గాయపడిన సుధాకర్ కు వైద్యం అందించకుండా స్టేషన్ కు తరలించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని ఓంశాంతి నగర్‌లో వైసీపీ, టీడీపీ వర్గీయులు పరస్పరం రాళ్లదాడికి దిగారు. రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు ఇళ్లలోకి దూరి తలుపులు వేసుకున్నారు.
వైసీపీ ఏజెంట్ పై కత్తితో దాడి
ఏపీలో ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. తాజాగా చిత్తూరు నియోజకవర్గం సంబంధించిన గుడిపాల మండలంలోని మండి కృష్ణాపురం పంచాయతీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు.. వైసీపీ ఏజెంట్ పై కత్తితో దాడి చేసినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో వైసీపీ నేత తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం
పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనన్న టీడీపీ అధ్యక్షుడు ఆరోపించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆరోపించారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా శాంతిభద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు ఆరోపించారు. ఈసీ వెంటనే పోలింగ్ ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం