Voter slap to MLA: సంయమనం కోల్పోయిన ఎమ్మెల్యే.. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు చెంపదెబ్బ, ఈసీ ఆగ్రహం
Voter slap to MLA: ఏపీ ఎన్నికల పోలింగ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తెనాలి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేను ఓటరు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఓటరును ఎమ్మెల్యే చెంప దెబ్బ కొట్టడంతో అతను తిరగబడి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు.
Voter slap to MLA: తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఓటరు చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు.
పోలింగ్ కేంద్రంలోకి తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. ఓ యువకుడు ఎమ్మెల్యే తీరును ప్రశ్నించడంతో ఆగ్రహించిన శివకుమార్ ఓటరును చెంప దెబ్బ కొట్టారు. దీంతో సదరు వ్యక్తి కూడా ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
మరోవైపు ఎమ్మెల్యే ఓటరుపై దాడి చేసిన ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయంలోని కంట్రోల్ రూమ్‌లో ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న ఎన్నికల పోలీస్ పరిశీలకుడు మిశ్రా గుర్తించారు. ఎమ్మెల్యే అభ్యర్థి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెనాలిలో ఓటరుపై న వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ చెంప దెబ్బ కొట్టడం, ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించడం కెమెరాలలో రికార్డైంది. క్యూలైన్‍లో కాకుండా పోలింగ్ కేంద్రంలోకి నేరుగా వైసీపీ అభ్యర్థి వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను చెంప దెబ్బ కొట్టడంతో ఓటరుపై ఎమ్మెల్యే అనుచరుల విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈసీ ఆగ్రహం..
మరోవైపు తెనాలి ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి ఘటనను వెబ్ కాస్టింగ్‌లో స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ మిశ్రా పరిశీలించారు. దాడి విషయం తెలిసిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీసీటీవీ ఫుటేజీలను మిశ్రా తనిఖీ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే తీరుపై మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతానగర్ పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన దీపక్ మిశ్రా, ఐతానగర్‍లో ఓటరుపై వైసీపీ అభ్యర్థిపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటన సీసీ టీవీ ఫుటేజ్‍ను తెప్పించాలని ఎన్నికల సంఘం సీఈఓను ఆదేశించారు.
ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగిన మరో 5 ప్రాంతాల్లోని పరిస్థితి నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడి ఆదేశాలతో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులను సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
దాడికి ముందు దుర్భాషలాడాడని ఆరోపించిన ఎమ్మెల్యే…
తెనాలి ఐతానగర్‌లో తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లినపుడు, తనను గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి దూషించాడని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా కొన్ని వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ తనను దుర్భాషలాడినట్టు అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు.
గొట్టుముక్కల సుధాకర్ వైయస్సార్ పార్టీపై చాలా ద్వేషంతో రగిలిపోయాడని, భార్య ముందే అసభ్యంగా ధూషించాడన్నారు. బూత్‌లోకి వెళ్లేటప్పుడు..వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడన్నారు. గొట్టిముక్కల సుధాకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతి పరుడని, తనను కులం పేరుతో దూషించాడని, మద్యం మత్తులో అందరి ముందు దురుసుగా ప్రవర్తించాడని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు.
సుధాకర్ బెంగుళూరులో ఉంటూ ఇక్కడకు వచ్చి హడావిడి చేశాడని, టీడీపీ - జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో మనుషులను పిలిపించి వైసిపి ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
జిల్లాల వారీగా పోలింగ్…
ఏపీలో మధ్యాహ్నం 11 గంటల వరకు దాదాపు 25శాతం పోలింగ్ నమోదైంది. అల్లూరి జిల్లా 18.61శాతం, అనకాపల్లి 19.75 శాతం పోలింగ్ - అనంతపురం 23.90, అన్నమయ్య 22.28 శాతం పోలింగ్ - బాపట్ల 26.88, చిత్తూరు 25.81 శాతం పోలింగ్ - అంబేద్కర్ కోనసీమ 26.74, తూ.గో. 21.75 శాతం పోలింగ్ - ఏలూరు 24.28, గుంటూరు 20.84 శాతం పోలింగ్ - కాకినాడ 21.26, కృష్ణా 25.84 శాతం పోలింగ్ - కర్నూలు 22.05, నంద్యాల 27.19 శాతం పోలింగ్ - ఎన్టీఆర్ జిల్లా 21.39, పల్నాడు 23.25 శాతం పోలింగ్ - పార్వతీపురం మన్యం 15.40 శాతం పోలింగ్ - ప్రకాశం 23.89, నెల్లూరు 23.77 శాతం పోలింగ్ - శ్రీసత్యసాయి 20.61, శ్రీకాకుళం 21.37 శాతం పోలింగ్ - తిరుపతి 22.66, విశాఖ 20.47 శాతం పోలింగ్ - విజయనగరం 23.21, ప.గో 23.20 శాతం పోలింగ్ - కడప 27.02 శాతం పోలింగ్ నమోదైంది.