Ysrcp Vs TDP : మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం- వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం
Ysrcp Vs TDP : రాజమండ్రిలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథానికి దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది.
Ysrcp Vs TDP : రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం అయింది. ఈ ఘటన రాజమండ్రిలో రాజకీయ దుమారం రేపింది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదీ టీడీపీ పనేనని వైసీపీ ఆరోపిస్తే, తమకెలాంటి సంబంధం లేదని టీడీపీ పేర్కొంటుంది. రాష్ట్రంలో అధికారం మార్పు తరువాత పలుచోట్ల దాడులు జరిగాయి. తమ కార్యాలయాలు, నేతల ఇళ్లపై టీడీపీ, జనసేన మద్దతుదారులు దాడులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పలుచోట్ల టీడీపీ, వైసీపీ పరస్పర దాడులకు తెగబడుతున్నాయి.
తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం అయింది. దుండగులు నిప్పు పెట్టడంతోనే ప్రచార రథం దగ్ధం అయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్ కార్యాలయంలో ఉన్న ప్రచార రథం శనివారం మంటల్లో కాలిపోతూ కనిపించింది. ప్రచార రథానికి మంటలు అంటుకోవడంతో స్థానికులు గుర్తించి ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే అనుచరులకు కూడా సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికి ఆ వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల నుంచి వచ్చిన సమాచారాన్ని అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఎన్నికల ఫలితాల తరువాత స్తబ్ధతగా ఉన్న రాజమండ్రి, విజయానందంలో టీడీపీ ఉండగా, వైసీపీ నిరాశలో ఉంది. అయితే ఈ ఘటనతో రాజమండ్రిలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ, టీడీపీ నాయకులు మాటల యుద్ధం, పరస్పర ఆరోపణలతో ఒక్కసారిగా రాజమండ్రి ఉలిక్కి పడింది. వైసీపీ నేత మార్గాని భరత్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుల మధ్య మాటల యుద్దం నడిచింది.
టీడీపీ పనే...రాజమండ్రిలో ఇలాంటి కల్చర్ లేదు- మార్గాని భరత్
ప్రచార రథం దగ్ధం కావడం అధికార టీడీపీ పనేనని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై టీడీపీ దాడులు చేస్తుందని, ఈ నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని విమర్శించారు. రాజమండ్రికి ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇలాంటి దాడులు రాజమండ్రిలో మొదటిసారి చూడటమని పేర్కొన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదని, ఇది హేయమైన చర్య అని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. అప్పుడే బాధ్యులు ఎవరనేది తెలుస్తుందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే స్పష్టం అవుతుందని, ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
రాజకీయం చేయొద్దు- టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయొద్దని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి తానే స్వయంగా ఫోన్ చేసి చెప్పానని అన్నారు. ఆకతాయిలను పెంచి పోషించిన పార్టీ వైసీపీనేనని విమర్శించారు. తమకు చాలా అంశాలు ఉన్నాయని, ఇదొక్కటే తమకు అంశం కాదని ఎద్దేవా చేశారు.
బాపట్ల జిల్లాలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నిప్పు
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై వైసీపీ అధికారికంగా స్పందించింది. విచక్షణ మరిచి, టీడీపీ వికృత క్రీడ ఆడుతుందని వైసీపీ విమర్శించింది. అద్దేపల్లిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి టీడీపీ వాళ్లు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారంటూ వైసీపీ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసింది. జూన్ 4 నుంచి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తు్న్న టీడీపీ హుందా రాజకీయాలు అంటే ఇవేనా అంటూ ఎద్దేవా చేసింది. అలాగే మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పెట్రోల్ పోసి తగలపెట్టడమంటే ఎంత అరాచకం, దీనిపై చర్యలు తీసుకోరా? పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పని చేస్తుందని ప్రశ్నించారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం