Ysrcp On Attacks : ఏపీని టీడీపీ తగలబెడుతోంది, దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు- వైసీపీ ఎంపీలు
Ysrcp On Attacks : ఏపీలో అన్యాయం రాజ్యమేలుతోందని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై దాడులకు సంబంధించి ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.
Ysrcp On Attacks : ఏపీలో వైసీపీ శ్రేణులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ, జనసేన... వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యకర్తల పైన దాడులు చేయడం, ఇళ్లు కూలగొట్టడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కు లేఖలు రాశామన్నారు.

అన్యాయం రాజ్యమేలుతోంది
ఏపీలో శాంతి భద్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని, వాటిని పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. గత వారం రోజులుగా టీడీపీ, జనసేన శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. దాడులను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఏపీలో చట్టం, న్యాయం, సేచ్ఛ లేదన్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు తీసుకోవడంలేదన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ కార్యకర్తలు, వాళ్ల ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారని విమర్శించారు.
ఏపీ తగలబడుతోంది
ఏపీలో చంద్రబాబు పాలన చీకటి అధ్యాయంగా చర్రితలో మిగిలిపోతుందని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడి చేసి, ఇతరులను భయాందోళనకు గురిచేసేందుకు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారన్నారు. మంగళగిరిలో ఈ తరహా దాడులను చూశామన్నారు. లోకేశ్ అనుచరులు సోషల్ మీడియా కార్యకర్తలపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోందని, హింసను ప్రేరేపిస్తోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను కూడా అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయిందని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఉద్దేశపూర్వకంగా దాడులు
"ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. టీడీపీ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ దాడులు చేసి తిరిగి మేము చేస్తున్నట్టు వక్రీకరిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే హింసకు నాంది పలికారు. ఎన్నడూ లేని కొత్త హింసా సంస్కృతి ప్రవేశపెట్టారు. ఉద్దేశపూర్వకంగా ప్రమాణస్వీకారానికి ముందే దాడులు జరపాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ హింస ఇలాగే కొనసాగితే దీనికి బీజేపీ కూడా బాధ్యత వహించాలి. వీసీలపై దాడులు చేయడం అమానవీయం. బంగారం లాంటి రాష్ట్రాన్ని టీడీపీ తగలపెడుతోంది. లోకేశ్ అనుచరులు రాజేష్ అనే వ్యక్తిని దారుణంగా హింసించారు" -విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ
ఏపీలో పోలింగ్ రోజున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇక ఫలితాలు వెలువడిన తర్వాత ఈ దాడులు మరింత పెరిగాయి. గతంలో సోషల్ మీడియా వేదిక విమర్శలు చేసిన వారిపై టీడీపీ, జనసేన నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే టీడీపీ మాత్రమే దాడులకు వైసీపీనే కారణం అంటోంది.
సంబంధిత కథనం