AP DGP Dwaraka Tirumala Rao : డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు
AP DGP Dwaraka Tirumala Rao : ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
AP DGP Dwaraka Tirumala Rao : ఏపీ కొత్త డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఆయన….మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం పోలీసుల గౌరవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమల రావు గతంలో పలు హోదాల్లో పనిచేశారు. సౌమ్యుడు, విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారనే పేరుంది. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల్లో సీనియర్‌గా ఉన్న ద్వారకా తిరుమల రావును హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ద్వారకాతిరుమల రావు ధర్మవరంలో ఏఎస్పీగా తొలుత పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్పీ పదోన్నతి లభించిన తర్వాత అనంతపురం, కడప, మెదక్ జిల్లాల్లో పనిచేశారు. విజయవాడ రైల్వే ఎస్పీగా, సీఐడీ, సిబిఐలలో పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్‌తో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలునిర్వర్తించారు. గతంలో అగ్రిగోల్డ్ వంటి కీలకమైన కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించారు.
మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ సమయంలో ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో ద్వారకా తిరుమలరావు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దృష్టిలో ఉంచుకుని సహచరులు, పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు ఏబీ వెంకటేశ్వరరావుకు వీడ్కోలు పలికేందుకు కూడా రాలేదు. ద్వారకా తిరుమలరావుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే ఏబీ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శంకబత్ర బాగ్చీకి ఫైర్ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించింది. కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పీవీ సునీల్ కుమార్ గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే వీరిపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక ఆరోపణలు, విమర్శలు కూడా చేసింది. అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని దుయ్యబట్టింది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావటంతో… వీరిని బదిలీ చేసింది.