AP Mlc Elections : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వర్మ, ఇక్బాల్? ఆ హామీ మేరకే!
AP Mlc Elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వర్మ, ఇక్బాల్ కు కేటాయించనున్నట్లు సమాచారం.
AP Mlc Elections : రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటీఫికేషన్ కూడా జారీ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కనుక రెండు స్థానాలు టీడీపీకే వస్తాయి. ఈ రెండు స్థానాలను భర్తీ చేయడానికి టీడీపీ కసరత్తు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారు చేసినట్లు తెలిసింది.
ఎన్నికల ఫలితాలకు ముందు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఐదు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కాగా, రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉన్నారు. ఐదుగురులో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇద్దరిపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కడపకు చెందిన సి.రామచంద్రయ్య పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉండటంతో ఆయనపై 2024 మార్చి 11న అనర్హత వేటు వేశారు. దీంతో ఆయన టీడీపీలో చేరారు. ఆయన ప్రస్తుతం తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయ వ్యవహారాలు చూస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ పనులు కూడా చక్కబెడుతున్నారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అనంతపురానికి చెందిన మహ్మద్ ఇక్బాల్, గుంటూరుకు చెందిన జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ పదవులకు, వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. అయితే మహ్మద్ ఇక్బాల్ రాజీనామాను 2024 ఏప్రిల్ 5న, జంగా కృష్ణమూర్తి రాజీనామాను 2024 మే 17న ఆమోదించారు. జంగా కృష్ణమూర్తి నాటి నరసరావుపేట వైసీపీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు అనుచరుడు. లావు శ్రీకృష్ణదేవరాయులు వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరిన తరువాత, జంగా కృష్ణమూర్తి కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు రెండు ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయన రాజీనామాను 2024 మార్చి 12 ఆమోదించారు. అలాగే విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పార్టీ కార్యకలాపాలకు, పార్టీ ఎస్.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అనర్హత వేటు వేశారు. ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు జూన్ 3న ఆయనపై అనర్హత వేటు వేశారు.
రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్సీ స్థానాలు?
రాష్ట్రంలో మొత్తం 58 ఎమ్మెల్సీ స్థానాలు కాగా, అందులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు 20, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు 20, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలు 5, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలు 5, గవర్నర్ నామినేటడ్ ఎమ్మెల్సీ 8 స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీకి 38, టీడీపీకి 8, ప్రొగసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్)కి 2, స్వతంత్రులు నలుగురు (ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు) ఉన్నారు. అయితే ఇండిపెండెట్లు ఉన్న నాలుగురిలో ముగ్గురు వైసీపీ మద్దతుతో గెలిచినవారే. ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు, రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, ఒక ఉపాధ్యాయ నియోజకర్గం (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి) ఎమ్మెల్సీ స్థానం ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదం మరణించడంతో ఆ స్థానం 2023 డిసెంబర్ 15 నుంచి ఖాళీగా ఉంది.
వర్మ, ఇక్బాల్‌కు ఇవ్వడానికి కారణం!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తన అభ్యర్థులుగా ఎస్‌వీఎస్ఎన్ వర్మ, మహ్మద్ ఇక్బాల్ పేర్లను ఖరారు చేయడానికి సిద్ధపడింది. వర్మ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో టీడీపీ పిఠాపురం ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోతే, ఇండిపెండింట్‌గా పోటీ చేసి 47,080 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పీవి విశ్వంకి కేవలం 15,187 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ తనను మోసం చేసిందని, టీడీపీ జెండాలు దగ్ధం చేసి కన్నీరు పెట్టుకుని వర్మ ప్రచారం చేశారు. సానుభూతి అద్భుతంగా పనిచేసి భారీ మెజార్టీతోనే గెలిచారు. అనంతరం మూడు రోజులకే టీడీపీలో చేరారు. ఆయన వ్యవహరించిన తీరుతో ఉద్యోగులు, ప్రజలు విసుగు చెంది 2019లో ఓడించారు. అప్పుడు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా, ఐదేళ్ల పాటు ప్రజల కోసం పని చేసి, మంచి ఆదరణ పొందారు. అయితే ఎన్నికలు వచ్చే సరికి టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా పిఠాపురం జనసేనకు కేటాయించారు. జనసేన తరపున ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో వర్మ, ఆయన అనుచరుల్లో అసంతృప్తి రగిలింది. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తి పోశారు. రాయడానికి వీలు లేని తిట్ల మోత మోగించారు. దీంతో వర్మను చంద్రబాబు విజయవాడకు పిలిపించి, ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ వర్మ, ఆయన అనుచరుల్లో సంతృప్తినిచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగానే ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఇక అనంతపురానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ 2027 మార్చి 29 వరకు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికీ, ఎన్నికల ముందు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గెలుపు కోసం ఇక్బాల్ శ్రమించారు. అలాగే ఇక్బాల్ పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్
ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలకు గడువు జులై 2తో ముగుస్తుంది. జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. జులై 12న ఎన్నిక జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సంఖ్య బలం చూస్తే రెండు స్థానాలు టీడీపీకే దక్కుతాయి. అందువల్ల ఎన్నిక జరగకపోవచ్చు. దాదాపు ఏకగ్రీవమే అవుతాయి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు