TTD Masterplan: టీటీడీ అప్టేట్…తిరుమలలో గెస్ట్‌హౌస్‌లకు సొంతపేర్లు ఉండకూడదు..
TTD Masterplan: తిరుమలలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన గెస్ట్‌హౌస్‌లపై ఈవో శ్యామల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. - 2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినా, అది జరగలేదని, 2019లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ గురించి ఎవరికి తెలియదని, ప్రణాళిక ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదన్నారు.
TTD Masterplan: టీటీడీ మాస్టర్ ప్లాన్ 2019లో రూపొందించినా దానికి అనుగుణంగా అభివృద్ధి పనులు, నిర్మాణాలు జరగలేదని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. చారిత్రాత్మక చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. పవిత్రత అనేది లేకుండా భవన నిర్మాణాలు చేశారని, తిరుమలలో కట్టిన నిర్మాణాలు సొంత పేర్లు ఉండకూడదని స్పష్టం చేశారు.
తిరుమలలో పలువురు ప్రైవేట్ వ్యక్తులకు టీటీడీ భూమి కేటాయించడం ద్వారా స్వామి వారి భక్తుల కోసం వసతి గృహాలను నిర్మించి వాటిని టీటీడీకి అప్పగించే పద్థతి ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలో కొందరు టీటీడీ కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టి వాటికి సొంత పేర్లను పెట్టుకోవడాన్ని గుర్తించారు. అలాంటి నిర్మాణాలకు టీటీడీ నుండి కొన్ని పేర్లు ఇస్తామని అవే పేర్లను ఆయా గెస్ట్ హౌస్‌లకు పెట్టుకోవాలని ఈవో స్పష్టం చేశారు.
తిరుమలలో కట్టే టౌన్ ప్లానింగ్ ప్రకారం నిర్మించాలని, ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుమలలో నిర్మాణాలు కట్టేశారని, సరైన నిబంధనలు లేకుండా కట్టినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమలలో నూతన టౌన్ ప్లాన్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
వచ్చే 25 సంవత్సరాలకు సంబంధించిన విజన్ డాక్యుమెంటరీ తయారు చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. తిరుమలలో మల్టిలెవల్, స్మార్ట్ పార్కింగ్, పుట్ పాత్ లు నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. బాలాజీ బస్టాండ్‌ను వేరేచోటకు తరలించాల్సి ఉందన్నారు.