Lagacharla Incident : తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం-nhrc notices telangana cs and dgp to submit comprehensive report on lagacharla incident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Lagacharla Incident : తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం

Lagacharla Incident : తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం

Basani Shiva Kumar HT Telugu
Nov 21, 2024 10:25 PM IST

Lagacharla Incident : లగచర్లలో అధికారులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదిక ఇవ్వనుంది.

తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు
తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు

ఫార్మా విలేజ్ కోసం భూసేకరణకు సంబంధించి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని.. లగచర్ల గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫిర్యాదు ప్రకారం.. 'నవంబర్ 11, 2024న జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు 1,374 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. దీంతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఆరోజు సాయంత్రం వందలాది మంది పోలీసులు, స్థానిక గూండాలతో కలిసి గ్రామంపై దాడి చేశారు. దాడికి గురైన వారిలో గర్భిణులు కూడా ఉన్నారు' అని ఫిర్యాదులో వివరించారు.

'గ్రామస్థులు బయటి వారి సహాయం కోరకుండా నిరోధించడానికి ఇంటర్నెట్, విద్యుత్ సేవలను నిలిపివేశారు. నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టారు. కొంతమంది గ్రామస్తులు తమ ఇళ్లను విడిచిపెట్టి అడవులు, వ్యవసాయ భూముల్లో ఆశ్రయం పొందేలా చేశారు. అక్కడ ఆహారం, వైద్య సహాయం, ప్రాథమిక సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నారు' అని ఫిర్యాదుదారులు ఆరోపించారు.

ఫిర్యాదును పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా అభిప్రాయపడింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ల స్థితి, నిర్బంధంలో ఉన్న వ్యక్తుల సంఖ్య, భయంతో దాక్కున్న వారి స్థితిగతులను ఈ నివేదిక ప్రస్తావించాలని స్పష్టం చేసింది.

బాధితులకు, ముఖ్యంగా గాయపడిన మహిళలకు అందించిన వైద్య పరీక్షలు, సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ కోరింది. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. వారంలోపు నివేదిక ఇవ్వనుంది. లగచర్ల గ్రామలో అధికారులపై దాడి కేసులో 47 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారిలో సగం మందికిపైగా అరెస్టు చేశారు. సంగారెడ్డి జైల్లో ఉంచారు.

Whats_app_banner