Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ 9 విషయాలు మీ కోసమే!
Health Insurance : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊహించని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆస్పత్రులకు వెళ్లే.. లక్షల్లో బిల్లు అవుతోంది. దీంతో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే.. ఇదే అదనుగా కొందరు మోసాలు చేస్తున్నారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచుతున్నారు.
కరోనా తర్వాత.. ప్రజల్లో భయం పెరిగింది. ఎప్పుడు ఏ మహమ్మారి పంజా విసురుతుందోనన్న ఆందోళన ఉంది. మరోవైపు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రమాదాలు ఘోరంగా జరుగుతున్నాయి. ఏ చిన్న చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లినా.. వేలు, లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. దీంతో చాలామంది హెల్త్ ఇన్యూరెన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు.
ఇదే అవకాశంగా కొన్ని కంపెనీల ఏజెంట్లు మాయ మాటలు చెప్పి ప్రజలతో పాలసీ కట్టించి మోసాలు చేస్తున్నారు. అందుకే అన్ని వివరాలు తెలుసుకొని పాలసీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాలసీ విషయంలో పాటించాల్సిన 9 జాగ్రత్తలు ఇలా ఉన్నాయి.
1.ఏ కంపెనీ నుంచి పాలసీ తీసుకున్నా.. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా మన ప్రాంతంలో ఏయే ఆస్పత్రులతో ఆ కంపెనీ టయప్ అయ్యిందో తెలుసుకోవాలి.
2.కొన్ని కంపెనీలు కోపే.. (పేషెంట్, కంపెనీ) డబ్బులు చెల్లించే పాలసీలు ఇస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పాలసీ తీసుకోవాలి. 90-10 నిష్పత్తిలో చెల్లించే పాలసీ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
3.పాలసీ తీసుకున్న తర్వాత కంపెనీ వారు ఇచ్చే కార్డును జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డులో ఉన్న కచ్చితమైన వివరాలు ఇచ్చి పాలసీ తీసుకోవాలి. వీటి ఆధారంగానే పాలసీ కార్డు ఇస్తారు.
4.ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఈ పాలసీ కార్డు కీలకంగా ఉంటుంది. ఆస్పత్రుల్లో సిబ్బంది క్యాష్ లెస్, కార్డా అని అడిగితే.. కార్డు ద్వారా వివరాలు నమోదు చేయించుకోవడం మంచిది.
5.ఆత్మహత్యాయత్నాలకు సంబంధించిన చికిత్సలకు ఏ కంపెనీ పాలసీ వర్తించదు. ఎవరైనా వర్తిస్తుంది అని చెబితే.. మీరు మోసపోయినట్టు.
6.హెయిర్ ప్లాంటేషన్, దంత సంబంధిత చికిత్స, కాస్మోటిక్ సర్జరీ, మెటర్నిటీ చికిత్సకు కంపెనీలు డబ్బులు చెల్లించవు. ఒకవేళ గర్భం దాల్చక ముందే పాలసీ తీసుకుంటే.. మెటర్నిటీ చికిత్సకు వర్తిస్తుంది.
7.చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లే ముందు ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆస్పత్రికి వెళ్లేముందు మద్యం తాగొద్దు. రక్త పరీక్షలో 0.5 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజీ వస్తే.. పాలసీ వర్తించదు.
8.హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకునేవారు.. వ్యక్తిగత పాలసీ తీసుకోవడం కంటే.. ఫ్యామిలీ పాలసీ తీసుకోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
9.హెల్త్ పాలసీ తీసుకున్నవారికి ఆసుపత్రుల్లో ఎలాంటి సమస్య వచ్చినా.. సంబంధిత కంపెనీకి ఆన్‌లైన్ ద్వారా గానీ, ఏజెంట్ ద్వారా గానీ, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చు.