Visakha Hayagreeva Lands : విశాఖ హయగ్రీవ భూముల వివాదం, వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో చుక్కెదురు!
Visakha Hayagreeva Lands : హయగ్రీవ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తన భూమిని బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నించారని హయగ్రీవ ఎండీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు చేయొద్దని మాజీ ఎంపీ ఎంవీవీ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనుక చుక్కెదురైంది.
Visakha Hayagreeva Lands : వైసీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హయగ్రీవ భూముల వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై విశాఖ ఆరిలోవ పోలీస్ట్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని ఎంవీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉందని, అరెస్టు నుంచి రక్షణ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది.
హయగ్రీవ భూ వివాదం
విశాఖలోని హయగ్రీవ భూముల వ్యవహారం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. ఎంఓయూ పేరుతో ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించి, విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని తమ విలువైన భూములు కాజేసేందుకు ప్రయత్నించారని హయగ్రీవ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన సీహెచ్ జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును కొట్టివేయాలని మాజీ ఎంపీ ఎంవీవీ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ పై పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. ఇది సివిల్ వివాదమని, క్రిమినల్ కేసుగా మార్చడానికి వీల్లేదని, అరెస్టు నుంచి పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని హైకోర్టును కోరారు. అయితే కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉందని, ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
2008లో భూకేటాయింపు
విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలోని 12.5 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం వృద్ధుల కోసం 2008లో హయగ్రీవ ప్రాజెక్టుకు కేటాయించింది. అయితే 15 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అయితే ఈ భూమిని వైసీపీ నేతలు తన నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆ సంస్థ ఎండీ చెరుకూరు జగదీశ్వరుడు గతంలో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని తన భూమి బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించారని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవి, మరొకరిపై రెండ్రోజుల క్రితం ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు జగదీశ్వరుడు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. మరోసారి హయగ్రీవ ప్రాజెక్టు భూవివాదం తెరపైకి వచ్చింది.
ముగ్గురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు
2020లో హయగ్రీవ ప్రాజెక్టు అగ్రిమెంట్ సమయంలో తనను, తన భార్యను బెదిరించి ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నారని, తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగదీశ్వరుడు ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు ముగ్గురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ఆ ముగ్గురు నగరంలో అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. అయితే ఇంతలో ఈ కేసులో తనను అరెస్టు చేయొద్దని, కేసు కొట్టేయాలని మాజీ ఎంపీ ఎంవీవీ హైకోర్టును ఆశ్రయించారు.