AP Tourism : పీపీపీ మోడల్‌లో టూరిజం అభివృద్ధి.. పెట్టుబడిదారులకు రాయితీలు.. ప్రైవేటు వ్యక్తులకు అవకాశాలు
AP Tourism : ఏపీ ప్రభుత్వం టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పర్యాటకులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఏపీ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టూరిజంలో ప్రైవేటు వ్యక్తులకు అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేలా రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కొత్త టూరిజం పాలసీని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసన మండలిలో ప్రకటించారు. కొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక రంగంలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టనున్నామని వివరించారు.
పారిశ్రామిక హోదా..
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. నూతన పర్యాటక పాలసీతో పర్యాటక రంగానికి నూతనోత్తేజం వచ్చిందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాన్నారు. పీపీపీ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.
టూరిజం సర్క్యూట్‌లు..
పెట్టుబడిదారులను ఆకర్షించేలా, రాయితీలు కల్పిస్తూ పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రైవేట్ ఎంటర్ ప్రెన్యూర్స్ ముందుకొస్తే వారి ఆలోచన, ఆసక్తిని బట్టి అవకాశాలు కల్పిస్తామన్నారు. పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు 5-6 రోజులు ఆహ్లాదంగా గడిపేలా టూరిజం సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. టెంపుల్, అడ్వెంచర్, ఎకో టూరిజం కలుపుతూ.. టూరిజం సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తొమ్మిది జిల్లాల్లో..
రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో 774 కిలో మీటర్ల పరిధిలో ప్రతి జిల్లాకొక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని కందుల దుర్గేష్ వివరించారు. 25 టూరిజం సర్క్యూట్‌లు రూపొందించామని వెల్లడించారు. తద్వారా ఎకో, క్రూయిజ్,టెంపుల్, బీచ్, రిలీజియస్, వెల్ నెస్, అగ్రి టూరిజంలు అభివృద్ధి చేస్తామన్నారు. నూతన పాలసీలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలు అనుసంధానించామని చెప్పారు.
బీచ్‌ల అభివృద్ధి..
రాష్ట్రంలోని 974 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 బీచ్‌లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి కందులు దుర్గేష్ వెల్లడించారు. రుషికొండ బీచ్‌కు బ్లూ ఫాగ్ బీచ్‌గా గుర్తింపు, మరో 9 బీచ్‌లకు గుర్తింపు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎక్కువ సంఖ్యలో బీచ్‌లు బ్లూఫాగ్ జాబితాలో చోటు సంపాదిస్తే.. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు, బాపట్లలోని సూర్యలంక, పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం, మూలపర్రు, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, చింతలమూరి, మచిలీపట్నంలోని మంగినపూడి, ప్రకాశం జిల్లా రామాపురం, నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని వివరించారు.
రూ.100 కోట్లతో..
కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, తుని సమీపంలోని దానవాయిపేటను టూరిజం సర్క్యూట్‌లో భాగంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేట్ రిసార్ట్స్‌కు ధీటుగా రూ.130 కోట్ల వ్యయంతో హరిత, పున్నమి రిసార్ట్స్‌ను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. రూ.100 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 7 స్టార్ హోటళ్లు, రిసార్ట్స్, గోల్ఫ్ కోర్సులు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఓబెరాయ్, మైఫేర్ సంస్థలు.. తద్వారా 1,250 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తాజ్, ఒబెరాయ్, మేఫైర్ లాంటి సంస్థలే కాకుండా చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు.. అన్నింటికీ అవకాశాలు ఇస్తామన్నారు.
ప్రత్యేక ప్రణాళికలు..
నిరుద్యోగ యువత, ఫిషర్ మెన్‌లు ముందుకు వస్తే వారికి రాయితీలు ఇస్తామని.. తద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే పర్యాటక రంగం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)