IND vs AUS 1st Test: పెర్త్ టెస్టులో టీమిండియా సాహసం, ఆస్ట్రేలియాకి సర్‌‌ప్రైజ్ ఇచ్చేలా తుది జట్టు ఎంపిక-ind vs aus 1st test predicted playing 11 ashwin over jadeja for india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 1st Test: పెర్త్ టెస్టులో టీమిండియా సాహసం, ఆస్ట్రేలియాకి సర్‌‌ప్రైజ్ ఇచ్చేలా తుది జట్టు ఎంపిక

IND vs AUS 1st Test: పెర్త్ టెస్టులో టీమిండియా సాహసం, ఆస్ట్రేలియాకి సర్‌‌ప్రైజ్ ఇచ్చేలా తుది జట్టు ఎంపిక

Galeti Rajendra HT Telugu
Nov 21, 2024 09:02 PM IST

India vs Australia 1st Test: ఆస్ట్రేలియా పిచ్‌లు సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తుంటాయి. దాంతో ఒక ఒక పేస్ ఆల్‌రౌండర్, ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్లని ఆడించాలంటే.. ఒక మెయిన్‌ ప్లేయర్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి.

భారత్ టెస్టు జట్టు
భారత్ టెస్టు జట్టు (PTI)

ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ స్టేడియంలో తొలి టెస్టు శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాలో వరుసగా మూడోసారి బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీని గెలవాలని టీమిండియా ఆశిస్తోంది. కానీ.. ఇప్పుడు భారత జట్టులో ఎక్కువ మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం బలహీనతగా మారనుంది.

భారత్ జట్టులో ప్రస్తుతం ఎక్కువ మంది యువ ఆటగాళ్లు కనిపిస్తున్నారు. దాంతో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఈసారి సిరీస్ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క స్పిన్నర్‌కే ఛాన్స్

పెర్త్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కి అందుబాటులో లేడు. దాంతో ఓపెనర్‌గా ఎవర్ని ఆడిస్తారు? అనే సందేహం అందరిలోనూ ఉంది. ఇక ఆస్ట్రేలియా పిచ్‌ పేసర్లకి అతిగా సహకరించే అవకాశం ఉండటంతో రవీంద్ర జడేజా, అశ్విన్‌లో ఒకరినే ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా పిచ్‌లపై అనుభవం, రికార్డుల పరంగా చూసుకుంటే జడేజా కంటే అశ్విన్ బెస్ట్. దాంతో ఒకే ఒక స్పిన్నర్‌గా అశ్విన్‌ని ఆడించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి తొలి టెస్టు మ్యాచ్ ఆడటం దాదాపు ఖాయమైపోయింది. అతనితో పాటు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు తుది జట్టులో ఉండనున్నారు.

ముగ్గురు పేసర్ల మధ్య పోటీ

జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫస్ట్ ఛాయిస్‌కాగా.. మూడో స్థానం కోసం ప్రసీద్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా రేసులో ఉన్నారు. అయితే.. జడేజాని తుది జట్టు నుంచి తప్పించడం అభిమానుల్ని ఆశ్చర్యపరచవచ్చు. గత 4-5 ఏళ్లుగా రవీంద్ర జడేజాపై వేటు పడటం చాలా అరుదు. వన్డే, టీ20, టెస్టులు ఇలా ఫార్మాట్ ఏదైనా.. జడేజా తుది జట్టులో ఉంటూ వచ్చాడు.

గిల్ ఆడకపోతే పడిక్కల్‌కి ఛాన్స్

ఒకవేళ శుభమన్ గిల్ బొటనవేలు గాయం నుంచి కోలుకోలేకపోతే అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి రావచ్చు. భారత్ గత ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఆడిన గిల్.. మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌లో హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఒకవేళ గిల్ ఆడితే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా జట్టులో పెద్దగా మార్పులు జరిగే సూచనలు కనిపించడం లేదు. 2018 నుంచి పెర్త్ లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన రికార్డ్ ఆస్ట్రేలియాకి ఉంది. దాంతో గాయపడిన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ స్థానంలో మిచెల్ మార్ష్‌ను బరిలోకి దించి.. ఓపెనర్ నాథన్ మెక్ స్వీనీ‌ను ఓపెనర్‌గా ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి.

తొలి టెస్టుకు భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్/ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్/ ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా): నాథన్ మెక్ స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్

Whats_app_banner